నేడే ‘అమూల్‌’కు భూమి పూజ | - | Sakshi
Sakshi News home page

నేడే ‘అమూల్‌’కు భూమి పూజ

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

‘సూర్యఘర్‌’ను వినియోగించుకోండి రాజీతోనే కేసుల పరిష్కారం

తూప్రాన్‌: మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లి రైల్వే గేట్‌ సమీపంలో నూతనంగా నిర్మించనున్న అమూల్‌ డెయిరీ భూమి పూజకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు హాజరుకానున్నారు. వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ తదితర ప్రముఖులు పాల్గొంటారని పరిశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఈ డెయిరీ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అమూల్‌ సహకార నమూనాతో ఈ నూతన డెయిరీ ప్లాంట్‌ను సుమారు రూ.500 కోట్లతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నారాయణ్‌నాయక్‌

మెదక్‌ కలెక్టరేట్‌: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న పీఎం సూర్యఘర్‌ ముప్త్‌ బిజీలి యోజన పథకాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నారాయణ్‌నాయక్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ వద్ద శనివారం రెండోరోజు సేవా సేతు అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇందుకోసం భారీగా సబ్సిడీ అందిస్తుందని వివరించారు. కాగా, రెండోరోజు కార్యక్రమానికి 22 మంది వినియోగదారులు సోలార్‌ప్లాంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పా రు. ఈ విషయమై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కూడా సేవా సేతు కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ డీఈ రామేశ్వర్‌, డీటీ టెక్నికల్‌ శ్రీనివాస్‌, ఏడీ మోహన్‌బాబు, ఏఈ నవీన్‌, ఏఐ సోలార్‌ వెండర్‌ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అల్లాదుర్గం(మెదక్‌): చిన్న చిన్న కేసులను ఇరువర్గాలు రాజీతోనే పరిష్కరించుకోవాలని జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి సుచరిత అన్నారు. శనివారం మండల పరిధిలోని మాందాపూర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టులో న్యాయ సేవాధికారత ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చట్టపరమైన మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమ్య, ఉపసర్పంచ్‌ కృష్ణ, పోలీస్‌ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

వెల్దుర్తి(తూప్రాన్‌): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు స్పెషల్‌ గెస్ట్‌ ఎడ్యుకేటర్లను నియమించనున్నట్లు వెల్దుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సాంబయ్య తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. స్పెషల్‌ బీఎడ్‌ అర్హత కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నవంబర్‌ 2026 నుంచి ఐదు నెలల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement