జిల్లాలో జోరుగా కలప అక్రమ దందా
● యథేచ్ఛగా రవాణా
● ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు
జిల్లాలో కలప అక్రమ దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు అమాయక రైతులను మభ్యపెడుతూ వారి పంట చేలల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తూ లారీల్లో తరలిస్తున్నారు. ‘వాల్టా’ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న వారిపై అటవీశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా హవేళిఘణాపూర్, నిజాంపేట మండలాల్లో ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేస్తూ సా మిల్లులు, ఇతర ఫ్యాక్టరీలకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని రామాయంపేట అటవీ రేంజ్ పరిధిలో ఇటీవల నాలుగైదు వాల్టా కేసులు సైతం నమోదయ్యాయి. కాగా, మెదక్ పరిసర ప్రాంతాల నుంచి ఆదివారం, ఇతర సెలవు దినాల్లో లారీల్లో రామాయంపేట మీదుగా అక్రమ కలప రవాణా సాగుతోంది. ఇదేంటని పలువురు అడిగితే సుబాబుల్, యూకలిప్టస్ కలప రవాణాకు ఎలాంటి అనుమతులు అక్కర లేదని, కేవలం సంబంధిత భూ యజమాని అంగీకారపత్రం ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
అనుమతులు శూన్యం
గ్రామాల్లో రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో తమ పంట చేలల్లోని చెట్లను తొలగించడం కో సం కలప వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు సంబంధిత అధికారుల పేరు చెబుతూ ముందస్తు అనుమతులు తీసుకోవాలని, దీనికి వారికి కొంత డబ్బు ఇవ్వాలని రైతులను మభ్యపెడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారు. ఉదయం సమయంలో చెట్లను నరికి కలపను ఒక చోట చేర్చుతున్నారు. సెలవు దినాల్లో రాత్రి సమయంలో లారీల్లో తరలిస్తున్నారు. జిల్లా పరిధిలో నిత్యం ఎక్కడో ఒక చోట చెట్లను నరుకుతూ లారీల్లో తరలిస్తున్నారు.
అటవీశాతం పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు అక్రమార్కులు ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వాల్టాకు తూట్లు పొడిచి కలప అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– రామాయంపేట(మెదక్)
ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఎవరైనా చెట్లను నరికివేసి అక్రమ కలప రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని కేసులు సైతం నమోదయ్యాయి. అక్రమ కలప రవాణాను అడ్డుకోవడానికి తమ సిబ్బంది రాత్రింబవళ్లు పని చేస్తున్నారు.
– జోజి, జిల్లా అటవీ అధికారి


