చెల్లించాల్సిన రాయల్టీ ఎంత? | - | Sakshi
Sakshi News home page

చెల్లించాల్సిన రాయల్టీ ఎంత?

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

చెల్లించాల్సిన రాయల్టీ ఎంత?

అక్రమాలకు అడ్డుకట్ట

ఏళ్ల తరబడి క్వారీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ సర్వే) విధానంతో తవ్విన ఖనిజం, చెల్లించాల్సిన రాయల్టీని ఇట్టే బహిర్గతం చేస్తోంది. ఫలితంగా సర్కారుకు పైసా తగ్గకుండా ఆదాయం వసూలవుతోంది.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 41 క్వారీలు ఉండగా, వాటిలో స్టోన్‌, మెటల్‌, కంకర క్రషర్లు ఉన్నాయి. అందులో 28 క్రషర్లు కొనసాగుతుండగా, మిగితా 13 క్వారీలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. కొన్ని పన్నులు చెల్లించక నిలిపి వేస్తే, మరికొన్ని క్వారీలు మెటల్‌ లేక నిలిపివేశారని మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. కాగా, ఏళ్ల తరబడి కొనసాగిన ఈ క్వారీల్లో ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ అన్నట్లుగా వ్యవహారం నడిచింది. వారు ఎంత తవ్వినా ‘చూపిందే లెక్క.. కట్టిందే పైకం’. దీంతో ఇంతకాలం అడ్డూ అదుపూ లేకుండా తప్పుడు లెక్కలు చూపిన క్వారీ ల కాంట్రాక్టర్లు రూ. కోట్లు గడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఈటీఎస్‌’ ద్వారా పైసా మిస్‌ కాకుండా ఇట్టే చెప్పేస్తోంది.

రెండు నెలల్లో డబుల్‌

2025 నుంచి జిల్లాలో నడుస్తున్న క్వారీల ద్వారా రూ. 5.87 కోట్ల డిమాండ్‌ ఉండగా, కేవలం రూ. 2.62 కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. ఈ లెక్కన రూ. 3.25 కోట్లు తక్కువగా వచ్చింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి సదరు కాంట్రాక్టర్లకు లీజుకు కేటాయించిన స్థలాలను డీజీపీఎస్‌ (డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌)తో ఈటీఎస్‌ ద్వారా సర్వే చేశారు. ఖనిజం విలువ ఎంత? అందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ (ఫీజు) ఎంత అనే వివరాలు ఇట్టే తెలిసిపోయింది. ఈనూతన విధానంతో ఏప్రిల్‌, మేలో రూ. 4.42 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదంతా రూ. 2.62 కోట్లు వస్తే, కేవలం రెండు నెలల్లో రెండింతల లాభం సర్కారుకు సమకూరింది.

టెండర్లలోనూ పారదర్శకత

గతంలో క్వారీని లీజుకు ఇవ్వాలంటే ముందుగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికే కేటాయించేవారు. అందులోనూ నేతలు సిఫారసు చేసిన వారికి పక్కాగా టెండర్‌ దక్కేది. ప్రస్తుత నూతన విధానంలో క్వారీల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటికి సంబంధించి ఓపెన్‌ టెండర్‌ నిర్వహించి ఎవరు ఎక్కువకు కోడ్‌ చేస్తే వారికే క్వారీని అప్పగించనున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆశించిన మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

‘ఈటీఎస్‌’తో ఇట్టే బహిర్గతం

క్వారీల్లో అక్రమాలకు చెక్‌

రెండు నెలల్లోనే ప్రభుత్వానికి రూ.4.42 కోట్ల ఆదాయం

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈటీఎస్‌ విధానంతో అక్రమాలకు వందశాతం చెక్‌ పడింది. దీని ద్వారా సదరు కాంట్రాక్టర్లు ఎంత మేర తవ్వారు.. దానికి చెల్లించాల్సిన రాయల్టీ ఇట్టే తెలిసిపోతుంది.

– నాగరాజు, ఏడీ మైనింగ్‌ మెదక్‌

Advertisement
 
Advertisement
Advertisement