ధాన్యం సేకరణ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ వేగవంతం చేయండి

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

ధాన్యం సేకరణ వేగవంతం చేయండి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు 95 శాతం కొనుగోళ్లు పూర్తి ఆర్డీఓకు పదోన్నతి ‘చేయూత’ ఏదీ? శివ్వంపేటలో భారీ వర్షం

మెదక్‌జోన్‌: ఽదాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం పార్టీ నేతలతో కలిసి కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నశంకరంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని తెలిపారు. వర్షాకాలంలో సకాలంలో విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. సబ్‌స్టేషన్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యవసాయానికి సక్రమంగా కరెంట్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట చిన్నశంకరంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ అంజిరెడ్డి, నాయకులు కిష్టయ్య, నారాయణ, ఆంజనేయులు, సాంబశివరావు ఉన్నారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తి పీఠంలో మంగళవారం వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ప్రముఖ గాయని ఉషా దంపతులు బగలాముఖి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. శక్తిపీఠం విశిష్టత గురించి వెంకటేశ్వరశర్మ వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 84,531 మంది రైతుల నుంచి 3,85,122 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం విక్రయించిన 66,900 మంది రైతులకు సుమారు రూ.708 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే 311 కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్లు చెప్పారు. రైతులు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

తూప్రాన్‌: ఆర్డీఓ జయచంద్రారెడ్డికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. డిప్యూటీ కలెక్టర్‌ బావయ్యను తూప్రాన్‌ ఆర్డీఓగా నియమించారు. అలాగే ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్‌ గోవర్దన్‌ కార్మిక శాఖకు బదిలీ అయ్యారు.

మెదక్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, హామీని విస్మరించి మోసం చేసిందని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల్లో 2 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించించి, ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. దీనికి నిరసనగా బుధవారం హైదరాబాద్‌లోని సెర్ప్‌ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సా యత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిపోయింది. పూర్తిస్ధాయిలో ధాన్యం తరలించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement