సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష వాగ్వాదాలు..నిలదీతల మధ్య సాగింది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాల అమలును వివరించగా..రైతుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. వి శ్వసనీయ సమాచారం ప్రకారం.. ధాన్యం సేకరణలో సర్కారు నిర్లక్ష్యం..జొన్నల కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మాణిక్‌రావు, సునీతారెడ్డి ప్రస్తావించారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా కూడా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీంతో అన్నదాతలు పడరానిపా ట్లు పడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలు రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ తమాషాలు చేస్తోందని వివేక్ వ్యాఖ్యానించడం పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. తక్షణం ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో జరిగిన వైఫల్యాలను మంత్రి వివేక్‌తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గుర్తుచేశారు.
ధాన్యం, జొన్నల కొనుగోళ్లలో వైఫల్యాలను ప్రస్తావించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న మంత్రి వివేక్
ఎమ్మెల్యేల కోటా కోసం పట్టు
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేల కోటా అంశాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంలో లేవనెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న మాదిరిగానే తమకు కూడా ఇళ్ల కోటాను కేటాయించాలని, తాము కూడా ప్రజల ఆశీర్వాదం ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాదిరిగానే ఈ ఇళ్లను తమకు కూడా కోటా నిర్ధారించాలని డిమాండ్ చేశారు.


