కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ విద్యకు నిలయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 91 పాఠశాలల హెచ్‌ఎంలతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యారంగంలో జిల్లా ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే విద్య ద్వారానే సాధ్యం అన్నారు. విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలే కాకుండా దేశంలోని ఎయిమ్స్ వంటి ఉత్తమమైన వైద్య కళాశాలలో ప్రవేశాలు పొందడానికి ప్రయత్నించాలన్నారు. అనంతరం జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 91 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 560కి పైగా మార్కులు పొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రంతో పాటు బహుమతులు అందజేసి సత్కరించారు. అంతకుముందు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫలితాల మెరుగు కోసం (2026– 27) జిల్లా వార్షిక ప్రణాళికా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రాజు, నవీన్, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎమ్మార్పీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


