నకిలీ పత్రాలు సృష్టించి నాలుగెకరాలు స్వాహా
పట్టాదారు చనిపోయిన రెండేళ్లకు వెలుగులోకి.. ఆర్‌ఐ, కంప్యూటర్ ఆపరేటర్ తప్పుదారి పట్టించారన్న తహసీల్దార్ ముగ్గురిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
అల్లాదుర్గం(మెదక్): మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌కు చెందిన దిమ్మయ్యగారి మాణేమ్మకు గ్రామ శివారులో సర్వే నంబర్ 957/ఆ3లో 4.12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో బిజిలీపూర్‌కు చెందిన వ్యక్తులు కబ్జాలో ఉన్నారు. అయితే మాణెమ్మ 2023 అక్టోబర్‌లో చనిపోయారు. ఈమెకు భూమయ్య, ప్రభాకర్, సుధాకర్ కొడుకులు. వీరు ఫౌతికి దరఖాస్తు చేసుకోక పోవడంతో తల్లి పేరుపైనే పట్టా ఉంది. ఈ భూమిలో కబ్జా ఉన్న బిజిలీపూర్‌కు చెందిన కిష్టయ్య పేరుపై సాదాబైనామా ఉంది. తనకు సాదాబైనామా కింద పట్టా చేయాలని 2025లో కిష్టయ్య దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే.. సాదాబైనామాకు ఆధారాలు లేవని ఆర్‌ఐ సందీప్ అదే సంవత్సరం సెప్టెంబర్ 23న తిరస్కరించారు. తదనంతరం కిష్టయ్య సైతం మరణించాడు. ఇదే ఆర్‌ఐ 2026లో భూ భారతి కింద పంచానామా చేసి ‘వీరు పట్టాకు అర్హులు’అని మరో పంచనామాను ఆర్డీఓ కార్యాలయానికి పంపించి, సాదాబైనామా కింద పట్టా చేసేందుకు అనుమతి తీసుకున్నారు. సాదాబైనామా కిష్టయ్య పేరుంటే.. అదే గ్రామానికి చెందిన విఠల్ పేరిట నాలుగెకరాలను పట్టా చేశారు. ఈ విషయంలో ఆర్డీఓ కార్యాలయంలో సైతం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పినట్లు తెలిసింది. కాగా, విఠల్ తన పేరిట పట్టా కాగానే అదే గ్రామానికి చెందిన భూమమ్మ పేరుపై 12 గుంటలు, కోడళ్లు అమనిక, స్వప్న పేరిట చెరో 20 గుంటలు, కిరణ్ పేరిట ఎకరా భూమిని పట్టా మార్పిడి చేశారు. విఠల్ తన పేరిట రెండెకరాలు భూమి ఉంచుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో మాణెమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
తప్పుదారి పట్టించారు: తహసీల్దార్
ఆర్‌ఐ సందీప్, కంప్యూటర్ ఆపరేటర్ మల్లేశం, మరో వ్యక్తి కలిసి తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి తనను తప్పుదారి పట్టించి అక్రమంగా 4.12 ఎకరాలను పట్టా చేయించారని తహసీల్దార్ మల్లయ్య అల్లాదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ముగ్గురు వ్యక్తులు కలిసి రూ: 5లక్షలు తీసుకుని అక్రమ పట్టాకు సహకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ శంకర్‌ను వివరణ కోరగా.. తహసీల్దార్ ఫిర్యాదు చేసింది వాస్తవమేనని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
చేతులు మారిన రూ: 40 లక్షలు!
అక్రమంగా పట్టా చేసిన 4.12 ఎకరాల భూమి విలువ సుమారు రూ: 2 కోట్లపైనే ఉంటుందని మార్కెట్ విలువను బట్టి తెలుస్తుంది. పట్టా మార్పిడిలో సుమారు రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమికి సంబంధించిన ఫైలును మాయం చేసినట్లు చెబుతున్నారు. కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, అవినీతికి పాల్పడిన వారి అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
భూభారతి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో జరిగిన అన్యాయాన్ని భూభారతితో సరిదిద్దుతామని, ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఆచరణలో విఫలమవుతోంది. ఓ భూ యజమాని చనిపోయాక కుటుంబ సభ్యులకు ఫౌతి చేయకుండా.. ఆర్‌ఐ, కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వేరొకరికి నాలుగెకరాల భూమిని పట్టా చేశారు. ఈ సంఘటన అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.


