పాపన్నపేట(మెదక్): ఎండుతున్న పంటలను పరిరక్షించేందుకు సింగూరు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు వెంటనే 0.03 టీఎంసిల సాగు నీరు విడుదల చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడే నాటికే ఘనపూర్ ఆయకట్టు రైతులు, మంజీరా నదిపై ఆధార పడి సేద్యం చేసే రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం ఇవన్నీ పొట్ట దశలో ఉన్నాయి. సాగు నీరు విడుదల చేయక పోవడంతో పంటలు ఎండు ముఖం పట్టాయి, రైతులు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, సర్పంచ్‌లు కాశినాథ్, బద్రి మల్లేశం, కొడుపాక, ఎంకెపల్లి, నాగ్సాన్‌పల్లి, గాజుల గూడెం, చిత్రియాల్ రైతులు మంగళవారం నాంపల్లిలోని మానవ హక్కుల సంఘం కార్యాలయానికి వెళ్లి సింగూరు నుంచి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలని కోరారు. ఘనపురం ఆయకట్టుకు సింగూరు నుంచి వెంటనే 0.03 టీఎంసీల నీరు విడుదల చేయాలని హెచ్‌ఆర్సీ చైర్మన్ షమీం అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం


