ఇందిరమ్మ ఇళ్లకు ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు ఇక్కట్లు

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

మెదక్‌జోన్‌: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే వంటనూనెలు, పప్పుదినుసుల ధరలు మండుతుంటే.. తాజాగా స్టీలు, సిమెంట్‌ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధిక భారం పడుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.27వేల పైచిలుకు భారం పడుతుంందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, వాటిలో 6 వేల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు వేల ఇళ్లు పూర్తి కావస్తుండగా, మిగతా నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండున్నర టన్నుల స్టీలు, 200 బస్తాల సిమెంట్‌ అవసరం ఉంటుంది. పక్షం రోజుల క్రితం టన్ను స్టీలు ధర రూ.63 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.70 వేలకు చేరుకుంది. ఈ లెక్కన టన్నుకు రూ.7 వేలు పెరిగింది. దీంతో రెండున్నర టన్నులకు గానూ రూ.17,500 అదనపు భారం పడుతోంది. అలాగే సిమెంట్‌ బస్తా ధర 15 రోజుల క్రితం రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.330కి చేరుకుంది. ఒక్కో బస్తాకు రూ.50 పెరిగింది. దీంతో పెరిగిన ధరతో సిమెంట్‌కు రూ.10 వేలు అదనపు భారం పడుతోంది.

బిల్డర్లు, కాంట్రాక్టులు సైతం

స్టీలు, సిమెంట్‌ ధరలు పెరగటంతో ప్రభుత్వ పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు చేసే బిల్డర్లు, సైతం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో తాము, నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలవటం ఖాయమని ఆవేదన చెందుతున్నారు. కొందరైతే ధరలు తగ్గేంత వరకు పనులు చేయలేమని వాటిని నిలిపి వేస్తున్నారు.

నాలుగు వేల ఇళ్లకు

రూ.11.20 కోట్ల అదనం

ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తుండగా.. లబ్ధిదారులు మరికొంత డబ్బులు కలిపి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కానీ పెరిగిన స్టీలు, సిమెంట్‌ ధరలతో ఒక్కో ఇంటిపై రూ. 27,500 అదనపు భారం పడుతోంది. నాలుగువేల ఇళ్లకు ఏకంగా రూ.11.20 కోట్ల భారం అదనంగా పడనుంది. దీంతో పెరిగిన ధరలతో ఇళ్లు నిర్మించటం సాధ్యం కాదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.

భారీగా పెరిగిన స్టీల్‌, సిమెంట్‌ ధరలు

టన్ను స్టీలుకు రూ.7వేలు,

బస్తా సిమెంట్‌పై రూ.50 పెరుగుదల

ఒక్కో ఇంటిపై రూ.27వేల పైచిలుకు

అదనపు భారం

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

పనులు చేయలేం

స్టీలు, సిమెంట్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పనులు చేయలేం. ఇప్పటికే కుదుర్చుకున్న నిర్మాణాల్లో సైతం నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఇక కొత్తగా పనులు చేయలేం.

– కిశోర్‌, బిల్డర్‌, మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement