రామాయంపేట(మెదక్): ‘ఊరూరా ప‘రేషన్’’ శీర్షికన ఈనెల ఆరున సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ నగేశ్ మంగళవారం స్థానిక పౌరసరఫరాల గోదాంను సందర్శించారు. స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన అన్ని రేషన్ షాపులకు బియ్యం స్టాక్ పంపించాలని ఆదేశించారు. రికార్డులు పరిశీలించిన ఆయన.. ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని రేషన్ దుకాణాలకు స్టాక్ పంపారని తెలుసుకున్నారు.
ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వరల్డ్ హెల్త్ డే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మనకు డబ్బు ముఖ్యం కాదని, సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యమన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణపై కఠిన చర్యలు
నిజాంపేట(మెదక్): ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన రెవెన్యూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, మూడు నెలల రేషన్ సరుకుల పంపిణీ, జనగణనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్‌లో భాగంగా ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన వార్డు సభ్యుల హెల్త్ క్యాంప్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ వెంకట నర్సింహారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, ఆర్‌ఐ ప్రీతి, స్థానిక సర్పంచ్ నరేందర్ పాల్గొన్నారు.
గోదాంను సందర్శించిన అదనపు కలెక్టర్


