మహా మాఘం.. పుణ్యస్నానం
పాపన్నపేట(మెదక్): మాఘస్నానాలతో భక్తులు పులకించారు. ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల మంజీరా నదిలో సుమారు రెండు లక్షల మంది స్నానాలు ఆచరించారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ, ప్రత్యేక, ధర్మ దర్శనం క్యూలైన్లు కిటకిటలాడాయి. పోలీసులు భక్తులను కట్టడి చేయాల్సి వచ్చింది. మంజీరా నది చుట్టూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోతంషెట్పల్లి వైపు మొదటి బ్రిడ్జి వరకు వాహనాలు జామ్ అయ్యాయి. రాజగోపురానికి ఇరువైపులా భక్తులు కిక్కిరిసిపోయారు. అమ్మవారు దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. కాగా చాలా మంది భక్తులు జాతరలో తప్పిపోయారు. దీంతో ఈఓ కార్యాలయంలోని మైక్ ద్వారా ప్రకటనలు చేశారు.
భక్తులకు తప్పని తిప్పలు
పోతంషెట్పల్లి, నాగ్సాన్‌పల్లి వైపు కి.మీ దూరంలో వాహనాల పార్కింగ్ ఏర్పా టు చేయడంతో ఆలయం వద్దకు వచ్చేందుకు, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. గతంలో ఆలయం వద్ద షవర్ బాత్‌లు ఉండేవి. ఈసారి వాటిని ఏర్పాటు చేయలేదు. దీంతో మడుగు నీటిలో భయం, భయంగా భక్తులు స్నానాలు చేశారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం తాగునీరు సైతం అందించలేకపోయారు. దర్శనానికి రూ. 20, 100, 250, 500 వసూలు చేయడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొండెక్కిన కొబ్బరి కాయ
జాతర రద్దీని అవకాశంగా తీసుకొని రూ. 50కి కొబ్బరికాయ అమ్మాల్సిన కాంట్రాక్టర్ రూ.100కు విక్రయించారు. భక్తుల సమస్యలను తీర్చాల్సిన ఈఓ చంద్రశేఖర్ కేవలం గర్భగుడికే పరిమితమయ్యారని భక్తులు మండిపడ్డారు. మెదక్ డీఎస్నీ ప్రసన్నకుమార్ అధ్వర్యంలో 210 మంది పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
మంజీరా నదిలో భక్తుల పుణ్య స్నానాలు
మహా మాఘం.. పుణ్యస్నానం


