పట్నం.. పరవశం
కొమురవెల్లికి పోటెత్తిన భాగ్యనగర వాసులు
వెల్లివిరిసిన భక్తిపారవశ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లికి భాగ్యనగర వాసులు పోటెత్తారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. ‘మల్లన్నస్వామి మమ్మేలు.. కోరమీసాల స్వామి దీవించు..’ అంటూ భక్త జనం పారవశ్యంలో మునిగిపోయారు. మరోవైపు శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. ఆదివారం స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారాన్ని పురష్కరించు కుని హైదరాబాద్ భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి, స్వామివారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి పూ జలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది.
బోనాలతో బారులు
స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది బోనం. భక్తులు అందంగా అలంకరించిన బోనాలతో బారుతీరారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అలాగే గుట్టపై కొలువైన మల్లన్న సోదరి రేణుక ఎల్లమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.
దారులన్నీ కొమురవెల్లికే..
‘పట్నం వారం’ సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపే కొనసాగాయి. ఆలయానికి చేరుకునే రహదారుల్లో సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ ఆధ్వర్యంలో పోలీసులు భారీబందోబస్తు చేపట్టారు. కాగా సోమవారం ఉదయం ఆలయ తోట బావి ప్రాంగణంలో పెద్దపట్నం, అగ్నిగుండాల నిర్వహణకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
స్వామి వారి రాజగోపురం ఎదుట భక్తజనం
వైభవంగా మల్లన్న పట్నం వారం


