పుర బరి.. పార్టీల గురి
కాంగ్రెస్.. వార్డుకు ముగ్గురి పేర్లు
● అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి ● గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ● మెతుకుసీమలో వేడెక్కిన రాజకీయం
మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు వ్యూహాలురచిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రక్రియ పూర్తి చేసేలా నేతలు కసరత్తు చేస్తున్నారు. దీంతో మెతుకుసీమ రాజకీయం వేడెక్కింది.
– మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, 2020లో జరిగిన ఎన్నికల్లో అన్నింటిలో బీఆర్‌ఎస్ జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే. అనంతరం 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్, నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ గెలిచింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌లు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. నర్సాపూర్ నియోజకవర్గానికి వచ్చే సరికి బీఆర్‌ఎస్ ముందంజలో నిలిచింది. కాగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి.
బీఆర్‌ఎస్.. గెలుపు గుర్రాల వేట
ఉమ్మడి మెదక్ జిల్లాపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, ప్రత్యేకంగా మెదక్ బల్దియాపై ఎలాగైనా బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం మెదక్ పట్టణంలో గెలుపు గుర్రాలను తన పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఓ పేరున్న చైర్మన్ స్థాయి నేతను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించినట్లు తెలిసింది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
గెలుపే లక్ష్యంగా.. బీజేపీ
గత సర్పంచ్ ఎన్నికల్లో చావుతప్పి కళ్లు లొట్టపోయిన చందంగా బీజేపీ నామమాత్రపు సీట్లు గెలుపొందింది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా ఒక్కో వార్డు నుంచి ముగ్గురిని ఎంపిక చేసి ఆ పేర్లను రాష్ట్ర పార్టీకి పంపించనున్నట్లు తెలిసింది. వారిలో ఎవరికి బీఫాం దక్కితే వారే బరిలో నిలుస్తారని సమాచారం. కాగా గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ ఒక్కో మున్సిపాలిటికీ ఒక్కో ఇన్‌చార్జిని నియమించింది.
అధికార కాంగ్రెస్ వార్డుకు ముగ్గురి పేర్లను స్వీకరించాలని నిర్ణయించింది. వారిలో ఎవరికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని పరిశీలించి, గెలిచే వ్యక్తి పేరును ఫైనల్ చేసి బీఫాం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక దశ సర్వే సైతం పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. టికెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలకు భవిష్యత్తులో మరో అవకాశం కల్పిస్తామని చెప్పి ఎంపిక ప్రక్రియ కొనసాగించినట్లు తెలిసింది.


