యాసంగి సాగుకు విరామం
పాపన్నపేట(మెదక్): సింగూరుకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు కింద యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ నిర్ణయించింది. సుమారు రూ. 13 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయనున్నారు. కాల్వలకు సైతం లైనింగ్ పనులు చేపట్టనున్నారు. పంటల విరామంతో సింగూరు కింద 35 వేల ఎకరాలు, ఘనపురం కింద 21,625 వేల ఎకరాల్లో పంట వేసే అవకాశం లేదు. ఖరీఫ్ సీజన్‌లో అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. దీంతో యాసంగిపై ఆశలు పెట్టుకున్న రైతులు నిరాశకు లోనవుతున్నారు.
8.17 టీఎంసీలకు తగ్గింపు
సింగూరు జలాశయానికి ఎగువ మట్టికట్టలకు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తో పాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని, వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే, తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్‌ఆర్పీ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టాన్ని 517.5 మీటర్లకుకు, నిల్వలను 8.17 టీఎంసీలకు తగ్గించాలని కమిటీ సూచించింది.
తాగునీటికి ఢోకా లేదు
సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 1,800 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా 0.45 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన ప్రాజెక్టులో 3 టీఎంసీల నీరు ఉన్నా, వేసవి కాలం వరకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ప్రాజెక్టులో కనీసం 7 టీఎంసీలు ఉన్నా, హైదరాబాద్‌కు నీరందించవచ్చన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, రోజుకు 0.3 టీఎంసీల చొప్పున దిగువకు విడుదల చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం.
ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచండి
యాసంగికి పంట విరామం ఇచ్చినందున, ఘనపురం ఆన కట్ట ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు. 2014లో ఆనకట్త ఎత్తు పెంచేందుకు అప్పటి సీఎం కేసిఆర్ రూ. 43.64 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎత్తును మరో 1.725 మీటర్లు పెంచాలని భావించారు. కాగా కొంత వరకు పనులు జరిగాయి. భూసేకరణ కోసం మరో రూ. 8.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. వెంటనే నిధులు మంజూరు చేసి ఎత్తు పెంచాలని రైతులు కోరుతున్నారు.
రూ.13 కోట్ల అంచనాతో సింగూరుకు మరమ్మతులు
కాల్వలకు సైతం లైనింగ్
ప్రాజెక్టు కింద పంటలకు క్రాప్ హాలిడే
నీటి పారుదలశాఖ నిర్ణయం


