రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట(మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండేళ్లలో కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధి విషయమై ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత తమకే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్‌నాయక్, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


