ఎన్నికల వేళ మొరం దందా
రామాయంపేట(మెదక్): ఒక వైపు పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుండగా, ఇదే అదనుగా అక్ర మార్కులు చెలరేగిపోతున్నారు. అధికారుల దృష్టి ఎన్నికల నిర్వహణపై ఉన్న తరుణంలో గ్రామాల్లో పెద్దఎత్తున మొరం అక్రమ రవాణా కొనసాగుతోంది. మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, నార్సింగి తదితర మండలాల్లో ప్రతిరోజూ అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా చేపట్టిన మొరం తవ్వకాలతో చెరువులు, రహదారుల పక్కన పెద్ద, పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం పడిన ఈగుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. రామాయంపేటలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 1421 సర్వే నంబర్‌లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములుండగా, వీటిలో తవ్వకాలు నిత్యకృత్యం అయ్యాయి. ఎలాంటి ముందస్తూ అనుమతులు లేకపోగా, కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో తీరిక లేకుండా ఉన్న అధికారులు అటువైపు దృష్టి సారించడంలేదు.


