● వన్యప్రాణులను వేటాడితే జరిమానా, చావు దెబ్బలు ● కుశ్నపల్లి రేంజ్‌లో గ్రామీణుల భయాందోళన | - | Sakshi
Sakshi News home page

● వన్యప్రాణులను వేటాడితే జరిమానా, చావు దెబ్బలు ● కుశ్నపల్లి రేంజ్‌లో గ్రామీణుల భయాందోళన

Nov 26 2026 11:56 PM | Updated on Nov 26 2026 11:56 PM

● వన్యప్రాణులను వేటాడితే జరిమానా, చావు దెబ్బలు ● కుశ్నపల్లి రేంజ్‌లో గ్రామీణుల భయాందోళన

బెల్లంపల్లి: వన్యప్రాణులను వేటాడడం ముమ్మాటికీ నేరమే. అందుకు చట్ట ప్రకారం జరిమానా, జైలు శిక్ష ఉన్నాయి. కానీ బెల్లంపల్లి అటవీ డివిజన్‌ కుశ్నపల్లి అటవీ రేంజ్‌లో లాఠీతో దండిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రేంజ్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి దెబ్బల దండన శ్రుతిమించుతోందని గ్రామీణులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి వన్యప్రాణులను వధించినట్లు సమాచారం అందితే చాలు వెంటనే వారిని కార్యాలయానికి తీసుకెళ్లి చితక బాదుతున్నారని చెబుతున్నారు. ఓ వైపు నిందితుల నుంచి చట్ట ప్రకారం జరిమానా వసూలు చేస్తూనే మరోవైపు చట్ట విరుద్ధంగా చితకబాదడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తులకు అవగాహన కల్పించి ఇకపై వన్యప్రాణులను వధించకుండా, వేటాడకుండా చూడాల్సిన అధికారి లాఠీ దెబ్బల రుచి చూపిస్తూ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల జోగాపూర్‌ అటవీ ప్రాంతంలో వన్యప్రాణిని వధించిన ఘటన మరువక ముందే గత శనివారం కోనంపేట గ్రామానికి చెందిన వ్యక్తులు వన్యప్రాణిని చంపి మాంసం విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మైలారం, గొల్లపల్లి, నందుపల్లి, ఘన్‌పూర్‌, కుశ్నపల్లి తదితర గ్రామాల్లోనూ అటవీ జంతువుల వేట సాగించిన ఉదంతాలు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపదకు నష్టం కలుగకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారిపై ఉంది. ఆ తరహాలోనే విధులు నిర్వర్తిస్తున్నా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దండిస్తుండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. బాధితుల్లో నిరక్షరాస్యులు, ఎస్సీ, ఎస్టీలు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ అధికారి లాఠీదెబ్బకు గురైన గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు నెన్నెల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారులు ఆ అధికారి దూకుడును నివారించి అటవీ జంతువులను వేటాడకుండా గ్రామాల్లో అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నాం..

వన్యప్రాణులను వేటాడుతున్న వ్యక్తులను పట్టుకొచ్చి విచారణ చేస్తున్న మాట వాస్తవమే. కానీ లాఠీతో దండిస్తున్న ఘటనలు లేవు. ఇటీవల డెప్యూటీ రేంజ్‌ అధికారిపై ఫిర్యాదు రాగా డీఎఫ్‌వో విచారణ చేయగా రుజువు కాలేదు. చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తున్నాం. గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సైకి వివరణ ఇచ్చాం. ఎవరినైనా కొట్టినట్లయితే నేరుగా నాకు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తా.

– దయాకర్‌, అటవీ రేంజ్‌ అధికారి, కుశ్నపల్లి

అటవీ అధికారి లాఠీ దండన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement