మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు నాన్ బ్రాండెడ్ సరుకుల సరఫరా కొనసాగుతోంది. హాస్టల్ విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వంటశాలల్లో నిల్వ ఉంచిన సరుకుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన సరుకుల్లో మైదా, ఉప్మారవ్య, ఇడ్లి రవ్వలో తెల్ల పురుగులు ఉన్నాయి. గడువు తేదీ లేని ప్యాకెట్లు, సోంపులో జిలకర్ర వంటి సరుకులు సరఫరా అవుతున్నాయి. గతంలో జీసీసీ ద్వారా ఎస్టీ వసతిగృహాలకు బ్రాండెడ్‌తో కూడిన పప్పులు సరఫరా అయ్యేవి. ప్రస్తుతం విడి పప్పుల వల్ల పురుగులు పట్టి ఉంటున్నాయి. జిల్లాలో ఎస్సీ వసతిగృహాలు 24, బీసీ 16, ఎస్టీ 18 ఉన్నాయి. ఈ హాస్టళ్లకు అరకొరగా సరుకులు సఫరా అవుతున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసినా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వార్డెన్లు ఉంటున్నారు. రెండ్రోజుల క్రితం ప్రత్యక్షంగా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజేశ్వరి తనిఖీలో నాసిరకం సరుకుల సరఫరా వెలుగులోకి రావడం గమనార్హం. పల్లీపట్టిలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చింతపండు సరఫరా ఎవరిది..?
సంక్షేమ హాస్టల్లకు చింతపండు సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థుల భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టర్ చింతపండు సరఫరా తమది కాదంటుండడం, బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయవద్దని ఆదేశాలు ఉండడం వల్ల వార్డెన్లు అయోమయానికి గురవుతున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సాంబారు, పప్పుచారు, పులుసు కూరలు అందించాలి. చింతపండు సరఫరాకు కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో సమస్య జఠిలంగా మారింది. సరైన రుచి లేని కూరలు, పల్చటి పప్పు, మజ్జిగతో విద్యార్థులు భోజనం చేయాల్సి వస్తోంది. కేంద్రీకృత కొనుగోళ్ల విధానం వల్ల నాణ్యత లోపించిందని, తక్షణమే అధికారులు తనిఖీలు నిర్వహించి గతంలో మాదిరిగా బ్రాండెడ్, గడువు తేదీ ఉన్న నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని కోరుతున్నారు.


