కదిలే ఆస్పత్రి | - | Sakshi
Sakshi News home page

కదిలే ఆస్పత్రి

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

కాగజ్‌నగర్‌కు లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాక ఈ నెల 16 నుంచి నవంబర్‌ 5 వరకు వైద్యసేవలు కంటిచూపు నుంచి కాలిన గాయాల వరకు బోగీలోనే చికిత్స

కాగజ్‌నగర్‌టౌన్‌/ఆసిఫాబాద్‌: కుమురంభీం జిల్లా ప్రజలకు శుభవార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆస్పత్రి రైలు ‘లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఈనెల 16న కాగజ్‌నగర్‌కు రానుంది. ఇందులో కార్పొరేట్‌ ఆస్పత్రి తరహాలో రెండు కోచ్‌లలో 5 అత్యాధునిక ఆపరేషన్‌ టేబుళ్లు, ఎక్స్‌రే, ల్యాబ్‌, ఫార్మసీ, రికవరీ రూమ్‌లు ఉన్నాయి. 20 మంది పర్మినెంట్‌ సిబ్బంది, హైదరాబాద్‌, ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణులు ఆపరేషన్లు చేస్తారు. ఇందులో ఆపరేషన్‌ థియేటర్‌, గైనకాలజీ ఆపరేషన్‌ థియేటర్‌, డెంటిస్ట్‌ కోచ్‌, ఆఫీస్‌ రూం, డిన్నర్‌ కోచ్‌, కుకింగ్‌ కోచ్‌, మెడిసిన్‌ కోచ్‌ ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ ఆవరణలోనే స్క్రీనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి రైలులోనే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. ఈ నెల 16 నుంచి నవంబర్‌ 5 వరకు కాగజ్‌నగర్‌ స్టేషన్‌లోనే ఉండి మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించనుంది. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని, పూర్తి వివరాలకు 7039673793 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

అందుబాటులో ఉండే సేవలు

కంటి శుక్లాలు, (క్యాటరాక్ట్‌) ఆపరేషన్లు, పుట్టుకతో వచ్చే పెదవి చీలిక, మూగ, చెవుడు సమస్యలు, కాలిన గాయాలకు ప్లాస్టిక్‌ సర్జరీ, ఎముకల సమస్యలకు చికిత్స అందించనున్నారు. వైద్య పరీక్షలకు వచ్చే వారు తమ వెంట గుర్తింపు కార్డు తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్‌నగర్‌లోనే ఈ లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లాకు ప్రాధాన్యత సంతరించుకుంది. 1991లో ఇంపాక్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా ప్రారంభమైన ఈ రైలు ఇప్పటి వరకు 256 ప్రాజెక్టులను పూర్తి చేసింది. 2022లో కూడా ఈ రైలు కాగజ్‌నగర్‌లో వైద్యసేవలు అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement