దండేపల్లి: గొర్రెలు, మేకల పెంపకందారులకు సర్కారు తీపి కబురు అందించింది. అంతుచిక్కని వ్యాధులు, వర్షాకాలంలో జరిగే నష్టాలతో కుదేల య్యే జీవాల పెంపకందారులకు ఇకపై పూర్తి భరోసా దక్కనుంది. నామమాత్రపు ప్రీమియంతో బీమా రక్షణ కల్పించేలా వెసులుబాటు కల్పించింది. చాలామంది యువకులు, రైతులు వృత్తి, వ్యాపారంగానూ గొర్రెలు, మేకల పెంపకం ఎంచుకుంటున్నారు. పండుగలు, శుభకార్యాలు, హోటళ్లలో మాంసం వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో జీవాల కొనుగోళ్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ధరలు కూడా పలుకుతుండడంతో జీవాల పెంపకం లాభాల బాటలో సాగుతోంది. గాలికుంటు వంటి ప్రాణాంతక వ్యాధులు సోకినప్పుడు, భారీ వర్షాలు, పిడుగులు, వరదల సమయంలో, రోడ్ల వెంట ప్రమాదాలకు గురై జీవా లు మృత్యువాత పడుతున్నాయి. పెంపకందార్లు తీవ్ర నష్టాలను చవిచూసిన ఘటనలు జిల్లాలో అ క్కడక్కడ చోటు చేసుకున్నాయి. పూర్తిస్థాయి ప్రీమి యం భారం మోయలేక బీమా పథకాలకు దూరంగా ఉండేవారు. జీవాలు చనిపోయినప్పుడు తీవ్రంగా నష్టపోయేవారు. ప్రస్తుతం ఒక్కో గొర్రె, మేకకు రూ.13 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా బీమా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గత నెల 16న రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పథకాన్ని అధికారికంగా ప్రకటించారు.
విధి విధానాలు రాలేదు
జీవాలకు బీమా పథకాన్ని ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ఇంకా రాలేదు. రాగానే జీవాల పెంపకందారులకు సమాచారం ఇవ్వడంతోపాటు అవగాహన కల్పిస్తాం. బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూస్తాం.
–యాకూబ్‌రెడ్డి, జిల్లా పశుసంవర్థ అధికారి


