ప్రతీ కమతానికి భూధార్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కమతానికి భూధార్‌

Oct 6 2026 12:06 AM | Updated on Oct 6 2026 12:06 AM

రీసర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

ఇందిరమ్మ ఇళ్లతో గుడిసెలు లేని రాష్ట్రం

అర్హులైన పేదలందరికీ ఇళ్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం భూముల రీసర్వే చేపట్టాం. ప్రతీ భూకమతానికి భూధార్‌ నంబర్‌ కేటాయిస్తాం. ఇందిరమ్మ ఇళ్లతో గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 72 వేల మంది పేదలకు ఇళ్లు అందించేందుకు ప్రణాళిక రూపొందించాం.’ అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎకై ్సజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, రెండో దశలో మరో రెండు లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అటవీ సమస్యల వల్ల ఆలస్యం కాకుండా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.

భూ సర్వేతో వివాదాలు పరిష్కారం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక భూసర్వేను చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో సుమారు 125 ఏళ్ల క్రితం సర్వే జరిగిందని, రాబోయే ఏడాదిన్నరలో ప్రతీ గ్రామంలో సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మనిషికి ఆధార్‌ లాగా ప్రతి భూ కమతానికి భూధార్‌ రూపొందించే దిశగా కృషి జరుగుతోందని తెలిపారు. సమగ్ర సర్వేతో భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నిరోధించవచ్చన్నా రు. సర్వే పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరమైన అదనపు సామగ్రిని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. యువ అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఇలా పనిచేయడం వల్ల క్షేత్రస్థాయి పరిపాలనపై అవగాహనతో పాటు భవిష్యత్‌ సర్వీసులో ఉపయోగపడే అనుభవం లభిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాల్లో భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖల సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ప్రతీ రెవెన్యూ గ్రామంలో దశలవారీగా సర్వే నిర్వహించి, ప్రతి భూ కమతానికి ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాపింగ్‌(ఎల్‌పీఎం) నంబర్‌ కేటాయించాలన్నారు. సమగ్ర వివరాలు నమోదు చేసి భూ హక్కులకు భరోసా కల్పించాలని ఆదేశించారు.

అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి..

రాష్ట్ర ఎకై ్సజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందేలా పనిచేయాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే పరిపాలన ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అటవీ సమస్యలపై సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సర్వే గొప్ప అవకాశమని, గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, నిర్దేశిత గడువులోగా సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ లోకేశ్‌కుమార్‌, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ.గౌతమ్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లు భవేశ్‌ మిశ్రా, కలెక్టర్‌ రాజర్షి షా, హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ, గహ నిర్మాణ, అటవీ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement