చెన్నూర్: ప్రకృతి పూల పండుగ బతుకమ్మ. అడవిలో సహజంగా లభించే తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చడం ఆనవాయితీగా వస్తోంది. బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రతీ రోజు పేర్చే బతుకమ్మలో తంగేడు పువ్వు ప్రధానమైనది. రాష్ట్ర పుష్పంగానూ గుర్తింపు పొందింది. పండుగ సమయంలో అక్కాచెల్లెళ్లు బతుకమ్మ పేర్చుకోవడానికి అన్నదమ్ములు అటవీ ప్రాంతానికి వెళ్లి తంగేడు పూలు సేకరించి తీసుకొచ్చేవారు. పోటీపడి మరీ పెద్ద బతుకమ్మలు పేర్చేవారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ ఆడిన తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది తంగేడు పూలకు తీవ్ర కరువొచ్చింది. అటవీ ప్రాంతంలో తంగేడు చెట్లు అంతరించపోయాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో తంగేడు మొక్కలు నాటినప్పటికీ పూర్తి స్థాయిలో పెరగలేదు. దీంతో బతుకమ్మకు అవసరమయ్యే పువ్వు ఎక్కడా కనిపించడం లేదని గ్రామాల ప్రజలు అంటున్నారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్చే బతుకమ్మలో మొదట తంగేడునే చేరుస్తారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూలలో ఔషధ గుణాలు ఉంటాయని మహిళలు అంటున్నారు. గతంలో గ్రామ శివారు, చేలలో తంగెడు చెట్లు విరివిగా ఉండేవి. ఈ ఏడాది ఎక్కడా చెట్లు, పూలు కనిపించడం లేదు. వచ్చే శనివారం అమావాస్య నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. తంగేడు పూలు లేకపోవడంతో బంతిపూలు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు అంటున్నారు.


