మరణాలు తగ్గుదల.. వెంటాడుతున్న గాయాలు యువ కార్మికుల్లో రక్షణపై అవగాహన లోపం గనుల్లో అధికారుల పర్యవేక్షణ కరువు
శ్రీరాంపూర్: సింగరేణిలో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. కంపెనీ వ్యాప్తంగా ఏరియాలో వారానికోసారి ప్రమాదం చోటు చేసుకుంటుంది. గతంతో పోల్చితే ఫాటల్స్ (మరణాల ప్రమాదాలు) తగ్గిన సీనియస్ యాక్సిండెంట్ల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదు. పెరిగిన యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి పెరగడంతోపాటు పని చేసేటప్పుడు, హాలేజీల వద్ద కార్మికులు గాయాలపాలవుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, యువ కార్మికులకు రక్షణపై అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని సీనియర్ కార్మికులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల స్వీయ రక్షణ లోపంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. భూగర్భ గనుల్లో గతంలో రూఫ్‌ఫాల్, సైడ్‌ఫాల్ ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి. నేడు అవి చాలావరకు తగ్గాయి.
యువ కార్మికులతో..
కారుణ్య ఉద్యోగాలతో యువ కార్మికుల సంఖ్య పెరిగింది. గతంలో ఐదారేళ్లు యాక్టింగ్ చేస్తేనే కేటగిరీల ప్రమోషన్లు వచ్చేవి. నేడు ఏడాది దాటిన వెంటనే ప్రమోషన్లు వస్తున్నాయి. దీంతో పనిపై పూర్తిస్థాయిలో అవగాహన లేక, రక్షణ ఎలా పాటించాలో తెలియడం లేదు. మస్టర్ పడ్డ తర్వాత ప్రతీరోజు ఎస్‌ఓపీ, ఎస్‌ఎంపీలపై అవగాహన కల్పించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని గనుల్లో అండర్‌మేనేజర్లు పట్టుమని మూడు గంటలు కూడా భూగర్భంలో గులాయిల వద్ద ఉండటం లేదని, కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని సీనియర్ కార్మికులు పేర్కొంటున్నారు. సేఫ్టీ సూపర్‌వైజర్లు అలాగే వ్యవహరిస్తున్నారు. కార్మికులకు రక్షణపై అవగాహన కల్పించడంతోపాటు అండర్‌మేనేజర్లు, మేనేజర్లు గనుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని పలువురు పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో లోపం ఉంది
ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు హైరానా చేస్తున్నారు తప్పా క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు పట్టించుకోవడం లేదు. అండర్‌మేనేజర్లు విధిగా పనిచేయాలి. పనికి తగ్గట్లుగా మ్యాన్‌పవర్‌ను కేటాయించాలి. రక్షణ కమిటీ, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా అమలు చేయాలి.
– ఎస్కే బాజీసైదా,
గుర్తింపు సంఘం ఏరియా కార్యదర్శి


