నాలుగు రోజుల్లో 102.9 మిల్లీమీటర్ల వర్షపాతం కళకళలాడుతున్న పంటలు పూత, గూడ దశలో పత్తి చేలు ఎరువుల కోసం రైతుల వెంపర్లాట దిగుబడులపై పెరుగుతున్న ఆశలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నాలుగు రోజులు గా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలు పంట లకు ఊపిరిపోస్తున్నాయి ఎల్‌నినో ప్రభావంతో గత కొన్ని రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. శనివారం 26 మిల్లీమీటర్లు, ఆదివారం 45.7 మిల్లీమీటర్లు, సోమవారం 23.1 మిల్లీమీటర్లు, మంగళవారం 08.1 మిల్లీమీటర్లు, నాలుగు రోజుల్లో 102.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఎరువుల కోసం వెంపర్లాడుతున్నారు. పత్తి పూత, గూడ, వరి ఎదిగే, పొట్టదశలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఎరువుల కోసం పరుగులు పెడుతున్నారు. యూరి యాకోసం సొసైటీల వద్ద ఎదురుచూస్తున్నారు. యూరియా ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌తో అపసోపాలు పడుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేయాలంటే ఇతర ఎరువులతో ముడిపెట్టి ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డీసీఎ మ్మెస్, ప్యాక్స్ సొసైటీల్లో సరిపడా యూరియా తె ప్పించడం లేదని ఆరోపిస్తున్నారు. పంటలు పూత, కాతకు వచ్చే సమయంలో ఎరువులు అందక ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
పత్తి దిగుబడులపై ఆశలు
జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 3.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్ర ధానంగా పత్తి 1.72 లక్షల ఎకరాల్లో, వరి 1.34 లక్ష ల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పత్తి పూత, గూడ దశలో ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి ది గుబడులపై రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. దిగుబడులు సైతం భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి తెగుళ్లు ఆశించకుండా చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం పత్తిని లద్దెపురుగు, తెల్లదోమ, పచ్చదోమ, అక్కడక్కడ గులాబీ పురుగు ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ పురుగు ఆశించిన పంటలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. గతేడాది కూడా ఇదేవిధంగా చీడపీడలు ఆశించడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. వాస్తవానికి బీటీ పత్తి విత్తనాలను పురుగు, తెగుళ్లు సోకే అవకా శం చాలా తక్కువగా అవకాశం ఉంటుంది. కానీ నకిలీ, గుర్తింపు లేని విత్తనాలకే ఇలాంటి సమస్య వస్తుంది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే జిల్లాలో నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున్న దిగుమతి అయ్యాయని, ఈ విత్తనాలే ఎక్కువగా సాగు చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం పంట ఎదుగుదలతో పాటు చీడపీడలు సైతం విస్తరిస్తున్నాయి. సకా లంలో నిర్మూలిస్తే దిగుబడులు అధికంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో పంటల సాగు వివరాలు
పంట సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
పత్తి 1,72,160
వరి 1,34,901
కందులు 1,559
పెసలు 353
మొక్కజొన్న 153
కూరగాయలు 843
ఆయిల్‌పామ్ 448
ఇతర పంటలు 30
మొత్తం 3,10,447
నాలుగు రోజులుగా వర్షాలు..
జిల్లాలో రెండు వారాలుగా వర్షాలు లేక పోగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పత్తి పూత, గూడ దశకు వస్తుండగా నీటి తడి లేక రైతన్నలు ఆందోళన చెందారు. ముఖ్యంగా ఆలస్యంగా వరి సాగు చేసిన రైతులు నీటితడులకు ఇబ్బంది పడ్డారు. సాగు నీటికాల్వలు, బోరుబావులు ఉన్న రైతులు మోటర్ల ద్వారా నీరు అందిస్తే పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేసిన రైతులు పంటలు ఎండుతున్నాయని ఆందోళన చెందారు. జిల్లాలో శనివారం రాత్రి నుంచి మంగళవారం వరకు 102.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం ఈ వారం రోజుల్లో 32.8 మిల్లీమీటర్లు కాగా ఈ నాలుగు రోజుల్లో 70 శాతం అధికంగా నమోదైంది. బెల్లంపల్లిలో 42, మంచిర్యాలలో 22 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 859.1 మిల్లీమీటర్లు కాగా 872.7 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దండేపల్లి, కోటపల్లి మండలాల్లో సాధారణ స్థాయి కంటే 22 నుంచి 27 శాతం లోటు నెలకొంది.


