మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు.. రోడ్డు ప్రమాదంలో దంపతుల మృత్యువాత ఉట్నూర్‌లోని యేంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం శుభకార్యానికి వెళ్తూ కానరాని లోకాలకు

ఆదిలాబాద్‌టౌన్‌/గుడిహత్నూర్‌:ఏడడుగులు నడిచి.. జీవితాంతం కలిసి ఉండాలని ఒక్కటైన మూడుముళ్ల బంధం మరణంలోనూ వీడలేదు.. ఈ జంటను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది.. అన్న కుమారుడి వివాహ వేడుకలకు వెళ్తుండగా బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది.. మరికొంత దూరంలోనే గమ్యం చేరుకోవాల్సిన వారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.. దీంతో పెండ్లి బాజాలు మోగాల్సిన కుటుంబంలో చావు డప్పులు మోగే పరిస్థితి.

అసలేం జరిగిందంటే..

గుడిహత్నూర్‌ మండలం తోషం గ్రామ పంచాయతీ పరిధి తోయగూడకు చెందిన పెందూర్‌ లక్ష్మణ్‌ (50), పెందూర్‌ శకుంతల (45) దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పూర్ణబాయికి వివాహమైంది. కుమారుడు అరవింద్‌ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతుని సోదరుడు జైనూర్‌ మండలం పాట్నాపూర్‌లో నివాసం ఉంటున్న భీంరావు ఐదారేళ్ల క్రితం మృతి చెందాడు. గురువారం భీంరావు కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. ఆ కుటుంబానికి వీరే పెద్ద దిక్కు. సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి కుమారుడికి హల్దీ కార్యక్రమం మంగళవారం చేపట్టాల్సి ఉంది. దీంతో ఈ దంపతులు ద్విచక్ర వాహనంపై ఉదయం 11:30 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్‌ నుంచి బయల్దేరి వెళ్లారు. ఉట్నూర్‌ సమీపంలోని యేంద వద్ద కారును ఓవర్‌టేక్‌ చేసే సమయంలో బైక్‌ కారుకు తగలడంతో అదుపుతప్పి ఎదురుగా ఉట్నూర్‌ వైపు నుంచి ఆదిలాబాద్‌ వైపు వస్తున్న ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన బస్సుకింద పడ్డారు. పెందూర్‌ లక్ష్మణ్‌ తల, శరీర భాగాల పైనుంచి బస్సు టైర్లు వెళ్లడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన శకుంతల కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు ఉట్నూర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు ఉట్నూర్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

పెళ్లింట విషాదం..

ఎంతో సంబరంగా పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పెళ్లికి హాజరు కావాల్సిన బంధువులు అంతిమ యాత్రకు రావడంతో గ్రామాల్లో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement