మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

జూలై 31వరకు అవకాశం

ప్లాట్ల క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ

జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 56,605

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నవి 47,383

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌(లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) కింద రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత వాటిని క్రమబద్ధీకరించకుండా నిలిపివేయగా, గతేడాది ప్రస్తుత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి దరఖాస్తుదారులకు అవకాశం కల్పించింది. దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, ఫీజు చెల్లించలేని వారు చాలామంది సద్వినియోగం చేసుకోలేదు. ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గతేడాది జనవరి నుంచి మార్చి 31వరకు గడువు నిర్ణయించినా స్పందన రాకపోవడంతో ఏప్రిల్‌ 30వరకు పొడిగించింది. ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన రావడంతో మే 31వరకు గడువు పెంచిన అనంతరం రాయితీని నిలిపివేసింది. ప్లాట్లు కొన్నవారిలో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉండడంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదు. ఈ ఏడాదైనా దరఖాస్తుదారుల నుంచి స్పందన వస్తుందనే ఉద్దేశ్యంతో మరోసారి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారికి మరోసారి ఫీజులో 25శాతం రాయితీని ప్రకటించి జూలై 31వరకు గడువు విధించింది.

పెండింగ్‌లో 47,383 దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మంచిర్యాల నగర పాలక సంస్థతోపాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో మొత్తం 45,863 దరఖాస్తులు రాగా, అందులో 1,723 తిరస్కరణకు గురయ్యాయి. 5,097 మంది దరఖాస్తుదారులు గత ఏడాది 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం 39,043 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 10,742 మంది దరఖాస్తు చేసుకోగా, గతేడాది 25శాతం రాయితీ కోసం 7,674 మందికి గ్రామ పంచాయతీల నుంచి లేఖలు అందించారు. అందులో 2,402 మంది రుసుం చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోగా, 8,340 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 47,383 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, జూలై 31వరకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించేందుకు గడువు విధించింది. జిల్లాలో అత్యధికంగా మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 33,478 దరఖాస్తులు రాగా, అధికారులు దృష్టి సారిస్తే మోక్షం కలిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement