● దేశభక్తి, భవితకు దిక్సూచి ● పాఠశాలల్లో ఏర్పాటుకు విద్యాశాఖ సన్నాహాలు
మంచిర్యాలఅర్బన్: నిస్వార్థ సేవ, ధైర్యం, స్నేహభావం, క్రమశిక్షణ, నాయకత్వం, సాహసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే భారత సాయుధ దళాల అనుబంధ సంస్థ నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ)కు మహర్దశ రానుంది. ఐక్యత, క్రమశిక్షణ నినాదంతో ముందుకు సాగే ఎన్‌సీసీపై విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఎన్‌సీసీ శిక్షణ అందించడం ద్వారా నైపుణ్యాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సర్కారు పాఠశాలల్లో ఎన్‌సీసీ ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టింది.
వివరాల సేకరణ
జిల్లాల నుంచి ఎన్‌సీసీకి అనువైన పాఠశాలల ప్రతిపాదనలు పంపించాలని విద్యాశాఖ సూచించింది. 7, 8, 9వ తరగతుల్లో 50మంది కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు, 35ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న ఉపాధ్యాయులు ఉండాలని నిబంధన విధించింది. అన్ని అర్హతలు ఉండి టీచర్ ముందుకొస్తే మొదట కేర్‌టేకర్‌గా నియమిస్తారు. నాగ్‌పూర్ కేంద్రంగా మూడు నెలల శిక్షణకు సిద్ధంగా ఉండాలి. పరేడ్‌కు మైదానం తప్పనిసరి ఉండాలని పేర్కొంది. జిల్లాలో ఉన్నత పాఠశాలలు 108 ఉండగా.. వడపోత అనంతరం నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఒకే పాఠశాల ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీసీ శిక్షణలో క్యాడెట్ల ప్రతిభ ఆధారంగా పాఠశాల స్థాయిలో ఏ, కళాశాలలు, ఇంజినీరింగ్ స్థాయిలో బీ, సీ ధ్రువపత్రాలు ఇస్తారు. సైనికరంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 2నుంచి 5శాతం రిజర్వేషన్ పొందే వీలుంటుంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న ఎన్‌సీసీ ట్రూప్(యూనిట్)లు జిల్లాలో నాలుగైదు పాఠశాలలకే పరిమితం అయ్యాయి. 40ఏళ్లు పైబడిన టీచర్లు ఉండడం, ఇతర పాఠశాలలకు బదిలీపై వెళ్లడం, ఎన్‌సీసీలో చేరిక కు విద్యార్థులు అయిష్టత చూపడం.. బడిలో తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో కొన్నింట్లో ఎన్‌సీసీ క్యాంపుల అర్హతను కోల్పోయినట్లు తెలుస్తోంది.


