మూడు పబ్లిక్‌ స్కూళ్లు | - | Sakshi
Sakshi News home page

మూడు పబ్లిక్‌ స్కూళ్లు

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

● నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు ● వివరాల సేకరణలో విద్యాశాఖ నిమగ్నం

మంచిర్యాలఅర్బన్‌: కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా జిల్లాలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరుట్ల తరహాలో వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌(టీపీఎస్‌) ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అనువైన పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలపై విద్యాశాఖ సేకరిస్తోంది. అన్ని వివరాలు సేకరించి కలెక్టర్‌ ఆమోదం మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు.

పాఠశాలల వారీగా..

పాఠశాలల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లిలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గం పేరు, మండలాల సంఖ్య, టీపీఎస్‌ కోసం గుర్తించిన మండలాలు, మండలాల వారీగా పాఠశాలల సంఖ్యతోపాటు నాలుగు నుంచి ఆరెకరాల విస్తీర్ణం ఉన్నవాటిని గుర్తిస్తున్నారు. ప్రతిపాదిత క్యాంపస్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని.., ఎన్ని ఎకరాలు అందుబాటులో ఉన్నాయి.. విద్యార్థులు, గదుల సంఖ్య, ప్రహరీ ఉందా లేదా క్యాంపస్‌కు సమీపంలో ఉన్న ఏవైనా ప్రభుత్వ గురుకులాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈ లెక్కన నిబంధనల ప్రకారం మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో సీతారాంపల్లి జెడ్పీ పాఠశాలకు అవకాశం దక్కనుంది. మందమర్రి, కాసిపేటలో నాలుగు ఎకరాల విస్తీర్ణం మోడల్‌స్కూళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు అనువుగా ఉంటాయా అనే దానిపై వడపోస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లలో నర్సరీలో చేరి 12వ తరగతి వరకు చదివే అవకాశం ఉంటుంది.

మారనున్న దశ

జిల్లాలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు(టీపీఎస్‌) సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందిస్తారు. దూరప్రాంత విద్యార్థులకు బస్సులు సమకూరుస్తారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం, సైన్స్‌ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఫుట్‌బాల్‌ కోర్టు, పలు రకాల క్రీడ కోర్టులు, ఇండోర్‌ గేమ్స్‌ అధునాతన కిచెన్‌ గదులు, డైనింగ్‌హాలుతో ఏర్పాటయ్యే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో మహర్దశ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement