రైల్వేస్టేషన్లలో చల్లని నీరేది..! | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో చల్లని నీరేది..!

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

● వేసవికాలంలోనూ వేడినీరే దిక్కు ● అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఇబ్బందులు

బెల్లంపల్లి: రైలుచార్జీలు, రైల్వేఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌, ఇతర చార్జీల మోత మోగిస్తున్న రైల్వేశాఖ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు చల్లని నీరందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎంత పెరిగినా వేడినీరే దిక్కవుతోంది. రైల్వేస్టేషన్‌కు వచ్చే వారితోపాటు చిన్నారులు, మహిళలు, వృద్ధులు రైళ్లలో ఇతర సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వారు దప్పిక తీర్చుకోవాలంటే కష్టమవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రైలెక్కిన తర్వాత చల్లని వాటర్‌బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి ప్రధాన రైల్వేస్టేషన్లతోపాటు రవీంద్రఖని, మందమర్రి, రేచినీరోడ్‌ రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల ద్వారా రోజువారీగా సుమారు ఐదు వేల మందికి పైగా అప్‌, డౌన్‌ మార్గాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. పర్వదినాలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆ సంఖ్య ఎనిమిది వేల నుంచి పది వేల వరకు ఉంటుంది. మిగతా స్టేషన్ల కంటే మంచిర్యాల, బెల్లంపల్లిలో రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా రైల్వేస్టేషన్లలో ప్రస్తుతం అప్‌, డౌన్‌ మార్గాల్లో రెండు ఫ్లాట్‌ఫామ్‌లు ఉండగా.. మూడో ఫ్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికుల ద్వారా రైల్వేకు ఆదాయం వస్తున్న సౌకర్యాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అమృత్‌ 2.0 పథకం ద్వారా మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఫ్లాట్‌ఫామ్‌లపై చల్లని నీటిసౌకర్యం కల్పించే పరిస్థితులు లేకుండాపోయాయి. బెల్లంపల్లి 1వ ఫ్లాట్‌ఫామ్‌ జీఆర్‌పీ అవుట్‌పోస్టు వద్ద తప్పా మరెక్కడా చల్లని నీటి సౌకర్యం లేదు. అప్‌ మార్గంలో ఆఖరు బోగీలో వెళ్లే ప్రయాణికులకు తప్పా ఆ సౌకర్యం మరెవరికీ ఉపయోగపడదు. ప్రయాణికులు అత్యధికంగా వినియోగించే రెండో నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై చల్లని నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రవీంద్రఖని, మందమర్రి, రెచినీరోడ్‌ స్టేషన్లలోనూ చల్లని నీటి సదుపాయం లేదు. వేసవి తీవ్రత దృష్టా ఫ్లాట్‌ఫామ్‌లపై చల్లని నీటి సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement