సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గూడు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని సర్కారు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నత్తనడకన సాగుతోంది. మంజూరు చేసిన ఇళ్లలో పూర్తి చేసిన, పురోగతిలో ఉన్న నిర్మాణాల వివరాలు పరిశీలిస్తే, పేదలకు సొంతింటి కల నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. చాలా చోట్ల ఇళ్లు మంజూరయ్యాక నిర్మాణంలో వేగం పెరగడం లేదు. చాలాచోట్ల లబ్ధిదారులకు ఆర్థికంగా లేకపోవడం ప్రధాన కారణంగా మారింది. మేసీ్త్రలు, కూలీలు సకాలంలో దొరకక పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం మొదటి దశలో భూమి ఉండి, ఇల్లు లేని పేద, మధ్యతరగతి వారిని అర్హులుగా ఎంపిక చేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసింది. అయితే, జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గ పరిఽధిలోని జన్నారం మండలాన్ని కలుపుకొని మొత్తం 11వేల ఇళ్లకు పైగా అనుమతి వచ్చింది. కాగా, వీటిలో ఇప్పటివరకు ఎనిమిది వేలకుపైనే లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఏడు వేల ఇళ్లు పునాది దశలో, నాలుగు వేలకు పైగా గోడలు, మూడు వేలకుపైగా స్లాబ్ దశశలో ఉన్నాయి. వానాకాలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాల్సి ఉంది.
అష్టకష్టాల్లో లబ్ధిదారులు!
ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్నవారి లో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి వారే ఉ న్నారు. ఇళ్లు మంజూరు కావడంతో చాలామంది లబ్ధిదారులు ఉన్న ఇళ్లను కూల్చివేశారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే, సకాలంలో ఇంటి నిర్మాణానికి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోజురోజుకూ సిమెంట్, ఐరన్, ఇటుక, ఇతర సామగ్రి ధరలు పెరుగుతుండడంతోపాటు కూలీల కొరత ఏర్పడింది. దీంతో చాలామంది నిర్మాణాలు కొనసాగించేందుకు ఇ బ్బందులు పడుతున్నారు. పునాది దశలో రూ.లక్ష, గోడలు, పిల్లర్లు నిర్మించాక రూ.1.25లక్షలు, స్లాబ్ వేశాక రూ.1.75లక్షలు, చివరి దశలో రూ.లక్ష చొప్పున సర్కారు బిల్లులు మంజూరు చేస్తోంది. ఈ దశల్లో పనులు పూర్తయినట్లు ఫొటోలతో యాప్‌లో అప్‌లోడ్ చేశాక డబ్బులు జమవుతున్నాయి. అయి తే, ఇప్పటివరకు రూ.108కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. కాగా, కొన్నిచోట్ల బిల్లులు సకాలంలో రాక లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు తోడు మరికొంత వెచ్చించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు నేరుగా మేసీ్త్రలకు గుత్తా ఇవ్వగా, చాలాచోట్ల లబ్ధిదారులే కూలీలతో స్వయంగా నిర్మించుకుంటున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. వానాకాలం రాకముందే వేసవిలో అధికంగా ఇళ్లు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ దశల వివరాలు
నియోజకవర్గం మంజూరు గ్రౌండింగ్ పునాది గోడలు పైకప్పు చివరి దశలో..
మంచిర్యాల 3,451 2,433 2,138 1,743 1,362 131
బెల్లంపల్లి 3,475 2,603 2,602 1,216 774 117 చెన్నూరు 3,387 2,414 1,783 953 612 70
ఖానాపూర్(జన్నారం) 770 662 588 439 290 23
మొత్తం 11,083 8,112 7,111 4,351 3,038 341


