అంగన్‌వాడీలకు కొత్త ఫోన్లు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు కొత్త ఫోన్లు

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

● టీచర్లు, సూపర్‌వైజర్లకు పంపిణీ ● పాతవి హ్యాంగ్‌ అవుతుండడంతోనే..

మంచిర్యాలటౌన్‌: అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం కొత్త ఫోన్లు పంపిణీ చేస్తోంది. పోషణ్‌ ట్రాకర్‌ ద్వారా వివరాలు అప్‌డేట్‌ చేసేందుకు 2019లో ఇచ్చిన ఫోన్లు పాతవి కావడంతో, కొత్తవి ఇస్తోంది. జిల్లాలోని 974 కేంద్రాల్లోని 907 మంది టీచర్లు, 38మంది సూపర్‌వైజర్లకు వీటిని అందుకోనున్నారు. పాత ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవడం, స్టోరేజీ లేకపోవడంతోపాటు హ్యాంగ్‌ అవుతుండగా ప్రభుత్వం 4జీబీ ర్యామ్‌, 64 జీబీ మెమోరీతో కొత్త స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తోంది.

పనుల్లో పెరగనున్న వేగం

అంగన్‌వాడీ టీచర్లు చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తున్నారు. మూడేళ్లలోపు చి న్నారుల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు తల్లిదండ్రుల ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా సరుకులు అందజేస్తున్నారు. పిల్లల హాజరు, అల్పాహారం, వేడి భోజనం, పాలు, గుడ్ల పంపిణీ, చిన్నారుల ఎత్తు, బరువు, వ్యాక్సిన్‌ షెడ్యూల్‌, విటమిన్‌ ‘ఏ’ డోసులు, హెల్త్‌ చెకప్‌, హోం విజిట్లు, బాలామృతం పంపిణీ, గర్భిణులు, బాలింతల రిజిస్ట్రేషన్లు, వారికి అందించే ఆహారం తదితర 14 రకాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో నమోదు చేసి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

సేవల్లో వేగం పెంచేందుకే..

పాత ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌ డేట్‌ కాకపోవడం, హ్యాంగ్‌ అవుతుండడంతోనే ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు కొత్త స్మార్ట్‌ ఫోన్లు ఇస్తోంది. ఇప్పటికే జిల్లాలో పంపిణీని ప్రారంభించాం.

– రౌఫ్‌ఖాన్‌, జిల్లా సంక్షేమాధికారి

ప్రాజెక్ట్‌ల వారీగా కేంద్రాలు, టీచర్లు

ప్రాజెక్ట్‌ కేంద్రాలు టీచర్లు

మంచిర్యాల 244 222

లక్సెట్టిపేట 203 192

బెల్లంపల్లి 282 267

చెన్నూరు 245 226

మొత్తం 974 907

బలోపేతానికి ప్రభుత్వ కృషి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం జిల్లాలోని మంచిర్యాల, లక్సెట్టిపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని 244 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 218 మంది అంగన్‌వాడీ టీచర్లు, తొమ్మిది మంది ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, సీడీపీవో రేష్మ, సూపర్‌వైజర్‌ జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement