ఆశావహుల్లో ఉత్కంఠ
బీ ఫారం ఇవ్వని ప్రధాన పార్టీలు
పోటాపోటీగా వేసిన నామినేషన్లు
ఉపసంహరించుకునేది ఎందరో!
ఎన్నికల బరిలో నిలిచేదెందరో!
నేడు ప్రకటించనున్న పార్టీలు
మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి/లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కాగా, ప్రధాన పార్టీలు అభ్యర్థులకు బీ ఫారంలు అందలేదు. ఒకే పార్టీకి చెందిన పలువురు ఆశావహులు ఒకే స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, ఎందరు విత్‌డ్రా చేసుకుంటారు? ఎవరికి బీ ఫారం వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటిసా రి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 60 డివిజన్లుండగా ఆయా పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. బెల్లంపల్లి, చె న్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఒక్కోస్థానానికి ఒకరి కంటే ఎక్కువమంది నామినేషన్లు వేశారు.
పోటాపోటీగా నామినేషన్లు
అధికార కాంగ్రెస్ నుంచి ఆశావహుల సంఖ్య అధి కంగా ఉండడంతో బీ ఫాంరం స్పష్టమైన హామీ తీసుకున్నాకే పలువురు పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. ఇదే పరిస్థితి బీఆర్‌ఎస్, బీజీపీలోనూ కనిపిస్తోంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో 60 డివిజన్లుండగా బీజేపీ నుంచి 108 మంది, బీఆర్‌ఎస్ నుంచి 98 మంది, కాంగ్రెస్ నుంచి 77 మంది నామినేషన్లు వేశారు. బెల్లంపల్లిలో 34 వార్డులకు కాంగ్రెస్ నుంచి 123 మంది, బీఆర్‌ఎస్ నుంచి 81మంది నామినేషన్లు వేయగా, బీజేపీ నుంచి 27 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. చె న్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 56 మంది, బీఆ ర్‌ఎస్ నుంచి 36 మంది, బీజేపీ నుంచి 24 మంది నామినేషన్లు వేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 22వార్డులకు కాంగ్రెస్ నుంచి 88 మంది, బీఆర్‌ఎస్ నుంచి 53 మంది, బీజేపీ నుంచి 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. లక్సెట్టిపేట్‌లో 15 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 25మంది, బీఆర్‌ఎస్ నుంచి 32మంది, బీజేపీ నుంచి 25మంది నామినేషన్లు వేశారు.
చెన్నూర్‌లో రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే..
చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేసేందుకు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రంగంలోకి దిగారు. సమర్ధవంతమైన అభ్యర్థులను బరిలోకి దింపేందేందుకు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మున్సిపాలిటీల్లో గెలిచి సత్తా చాటాలనే ప్రయత్నం ముమ్మరం చేశా రు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చేరడంతో పార్టీకి బలం చేకూరింది.
లక్సెట్టిపేటలో త్రిముఖ పోరు..
లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్ర ధాన పోటీ ఉంది. గత నెల 30న ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్‌తో పాటు తుది జాబితాను విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా విడుదలైంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపికలో అంతర్గతంగా విబేధాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఈనెల 1న తొమ్మిది మంది అభ్యర్థుల జాబితా మాత్రమే విడుదల చేసి ఆరు స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు ఖరారు చేయలేదు.
ఎవరికి వారే అన్న
రీతిలో అభ్యర్థుల ప్రచారం
బీ ఫారం పక్కాగా తమకే వస్తుందని నమ్ముతున్న అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. అయితే, పలుచోట్ల ఒకే పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం ఖరారవుతుందని ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తూ ఒకే డివిజన్/వార్డులో వేర్వేరుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో గందరగోళం నెలకొంది. ఆదివారం అన్ని పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కాగా, ఆయా పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. ప్రచారానికి వారం రోజులే సమయం ఉండడంతో, ఓటర్లను ఎలా తమవైపు తిప్పుకోవాలనే దానిపై ఎవరికి వారు ప్రణాళికలు రచిస్తున్నారు. స్థానికంగా ఓటుండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని రప్పించి ఓట్లేయించుకునేందుకు పలువురు అభ్యర్థులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.
మున్సిపాలిటీల వారీగా నామినేషన్ల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు/డివిజన్లు నామినేషన్లు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
మంచిర్యాల 60 386 77 98 108 103
బెల్లంపల్లి 34 279 123 81 27 48
చెన్నూర్ 18 171 56 36 24 55
క్యాతన్‌పల్లి 22 241 88 53 33 67
లక్సెట్టిపేట 15 100 25 32 25 18
మొత్తం 149 1,177 369 300 217 291
ఆశావహుల్లో ఉత్కంఠ


