స్టార్ రేటింగ్ కమిటీ పరిశీలన
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిని ఫైవ్ స్టార్ రేటింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంవత్సరం గని మూతపడినా గత ఏడాది నిర్ణీత ప్రమాణాలు పాటించిన గనుల్లో ఆర్కే 6 గనిని ఫైవ్ స్టార్ రేటింగ్ ఎంపిక కోసం ప్రతిపాదించారు. ఈ మేరకు బుధవారం కమిటీ సభ్యులు గనిని సందర్శించి రికార్డులు పరిశీలించారు. జీఎం కార్యాలయంలో జీఎం ఎం.శ్రీనివాస్, అధికారులకు వివరాలు వెల్లడించారు. నాగపూర్‌కు చెందిన కోల్ కంట్రోల్ అధికారి రాజేంద్ర చోలే ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. గనిలో తీసుకుంటున్న భద్రత చర్యలు, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ చర్యలను ఏరియా జీఎం కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌వోటు జీఎం యన్.సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్‌బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు కే.వెంకటేశ్వరరెడ్డి, ఏజెంట్లు రాజేందర్, శ్రీధర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అతివలకు ఆత్మబంధువు షీ టీమ్
మంచిర్యాలక్రైం: అతివలకు ఆత్మబంధువుగా షీ టీమ్ పని చేస్తోందని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే వెంటనే రక్షణ చర్యలు చేపడుతామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, యువతులు, కళాశాల విద్యార్థినులు సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్ 24 గంటలు పని చేస్తుందని పేర్కొన్నారు. షీ టీమ్ ఆధ్వర్యంలో స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, ఫోక్సో, గుడ్ టచ్–బ్యాడ్‌టచ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీ–సేఫ్, హాక్–ఐ, 100 డయల్‌పై అవగాహన కలిగి ఉండాలని, క్యూఆర్ కోడ్, 100 డయల్, షీ టీమ్ వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.


