పత్తి ఎక్కువైనా ఏడుపే..!
మంచిర్యాలఅగ్రికల్చర్: దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రజాప్రతినిధులు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ అధికారులు పత్తి సేకరణలో ఎకరానికి ఏడు క్వింటాళ్ల పరిమితి విధిస్తున్నారు. ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవడమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తేమశాతం, పింజ పొడవు తదితర నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తుండగా.. తాజాగా ఏడు క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో పత్తి చేన్లకు వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దిగుబడి వచ్చిన పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందాం అనుకుంటే కొత్త నిబంధన మరింత కుంగదీస్తోంది. గతంలో ఎకరాకు 12క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఈ సీజన్ నుంచి ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితి విధించారు. ఐదు క్వింటాళ్లు తగ్గించడంతో ఎక్కువ వచ్చిన దిగుబడి తక్కువ ధరకు దళారులకు విక్రయించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 8నుంచి 12శాతం తేమ వచ్చిన పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. 8శాతం వచ్చిన పత్తికి క్వింటాల్‌కు ధర రూ.8,110 ఉండగా ఆపై తేమ ఉంటే ఒక్కో శాతానికి రూ.81 చొప్పున తగ్గించి కొనుగోలు చేస్తారు.
జిల్లాలో 1,69,397 ఎకరాలు..
జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో రైతులు పత్తి సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఖ రీఫ్‌లో 1,69,397 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భా రీ వర్షాల కారణంగా తగ్గిన దిగుబడి మేరకు 12 నుంచి 13లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధి కారులు అంచనా వేశారు. వర్షాలతో దెబ్బతిన్న లో తట్టు, ఎర్రనేలలు, చౌడు, ఇసుక భూముల్లో ఎకరా కు 5నుంచి 7క్వింటాళ్లు, నల్లరేగడి, సమాంతరంగా ఉన్న పల్ల ప్రాంతంలోని నేలల్లో 10నుంచి 12క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలకు పత్తి పోటెత్తనుంది.
గత ఏడాది అక్రమాలు
గత ఏడాది జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయి. పత్తి విక్రయానికి టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) జారీ చేశారు. దళారులు చెప్పిన ఫోన్ నంబరుకు ఓటీపీ వచ్చే విధంగా మార్కెట్ అధికారులు సహకరించారు. ఒకే రైతు పేరిట వందల క్వింటాళ్ల పత్తి విక్రయాలు సాగించారు. దిగుబడి అంచనా కంటే ఎక్కువగా కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పలువురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. దీంతో ఈ ఏడాది కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చారు. యాప్‌లో రైతులు స్లాట్ బుక్ చేసుకోకుంటే సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు చేయరు. జిల్లాలో చాలామంది రైతులకు ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోవడం, నిరక్షరాస్యత కారణంగా యాప్‌లో నమోదు అవగాహన లేక 75శాతం మంది దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దళారులను యాప్ ఏ మేరకు కట్టడి చేస్తుందో గానీ రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున మాత్రమే స్లాట్ బుక్ అవుతుంది. ఈ కొర్రీలతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే దుస్థితి నెలకొంది. ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని, పట్టాపాసుపుస్తకం, ఇతర ధ్రువీకరణ పత్రాల ఆధారంగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


