ఇటుకల పిల్లర్ పడి బాలుడు..
బేల: మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా కాలనీలో ఓ ఇంటి ప్రాంగణంలో ఆట ఆడుకునే క్రమంలో ఇటుకల పిల్లర్ పడి ఇందిరానగర్ కాలనీకి చెందిన బాలుడు డౌరే వీర్(7) తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రంలోని విఠల్ రుక్మబాయి ఆలయం కార్తిక పౌర్ణమి సప్తాహలో భాగంగా డౌరే ప్రణయ్ సోదరుడు శంకర్ ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం కోసం ఇంటి ఎదుట రోడ్డుపై వేసిన టెంట్ తాడును ఇంటి గేటుకు చెందిన ఇటుకల పిల్లర్‌కు కట్టారు. మంగళవారం చీకటి పడే క్రమంలో రాత్రి డౌరే ప్రణయ్ పెద్ద కూమారుడు డౌరే వీర్, టెంట్ తాడును పట్టుకుని లాగి ఆడుకునే క్రమంలో పిల్లర్ విరిగి పడింది. డౌరే వీర్‌కు తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది. వెంటనే వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు బాలుడి తండ్రి డౌరే ప్రణయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్. ప్రవీణ్ తెలిపారు.


