‘జోనల్‌’ క్రీడలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘జోనల్‌’ క్రీడలకు సిద్ధం

Nov 6 2025 8:28 AM | Updated on Nov 6 2025 8:28 AM

‘జోనల

‘జోనల్‌’ క్రీడలకు సిద్ధం

● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ● హాజరు కానున్న కాళేశ్వరం జోన్‌ పరిధి క్రీడాకారులు ● ఐదోసారి లక్సెట్టిపేట ఆతిథ్యం

లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల 11వ జోనల్‌స్థాయి బాలికల గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు ముస్తాబైంది. కాళేశ్వరం జోన్‌ పరిధిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల నుంచి క్రీడాకారులు హాజరు కానుండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6 గురువారం నుంచి జరిగే పోటీలకు జోన్‌ పరిధిలోని కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి 3, మంచిర్యాల నుంచి 4, ములుగు నుంచి 1, పెద్దపల్లి నుంచి 4, భూపాలపల్లి జిల్లా నుంచి 3 గురుకులాల విద్యార్థులు హాజరు కానున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కిలకిల రావాలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన విశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నారు. పోటీల కోసం కళాశాల ఆవరణలోని మైదానం సిద్ధం చేశారు. క్రీడాకారులకు వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. జోనల్‌ స్థాయి పోటీలకు లక్సెట్టిపేట కళాశాల ఐదోసారి ఆతిథ్యం ఇస్తుండగా అట్టహాసంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల నేపథ్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. మైదానంలో అన్ని క్రీడలకు కోర్టులు వేశారు.

6 నుంచి 8వరకు..

ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే పోటీల్లో కాళేశ్వరం జోన్‌ పరిధిలోని 15 పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో పాఠశాల/కళాశాల నుంచి 85మంది క్రీడాకారుల చొప్పున 1275మంది హాజరవుతారు. అండర్‌–14 విభాగంలో 375మంది, అండర్‌–17లో 375, అండర్‌–19లో 45మంది క్రీడాకారులు పాల్గొంటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, టెన్నికాయిట్‌, బాల్‌బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్స్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్‌ విభాగం నుంచి 100, 200, 400, 800, 1500 మీటర్లు, మూడు కిలోమీటర్ల పరుగు పందేలు, షార్ట్‌పుట్‌, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్‌, హైజంప్‌, రిలే వంటి పోటీలు నిర్వహిస్తారు. ఓవరాల్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా మల్లిక, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా రాధారాణి వ్యవహరిస్తుండగా, నిర్వహణ ఏర్పాట్లను ప్రిన్సిపాల్‌ రమాకళ్యాణి చూస్తున్నారు. బుధవారం రాత్రి వరకే క్రీడాకారులు ఆయా జిల్లాల నుంచి చేరుకున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న క్రీడాకారుల కోసం అన్ని విధాల సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మూడు రోజులపాటు పోటీలు కొనసాగుతాయి.

– రమాకల్యాణి,

కళాశాల ప్రిన్సిపాల్‌, లక్సెట్టిపేట

‘జోనల్‌’ క్రీడలకు సిద్ధం1
1/1

‘జోనల్‌’ క్రీడలకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement