యథేచ్ఛగా పశువుల తరలింపు
మంచిర్యాలక్రైం: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా ఎడ్లు, ఆవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ రవాణా మార్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా పశువుల తరలింపు సాగుతున్నా పట్టింపు కరువైంది. మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రాపూర్, రాజూరా, షిరోంచా, అహెరి, ఆలపెల్లి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కెరమెరి, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, నీల్వాయి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వద్ద నుంచి రోజు వందలాది పశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, రహదారులపై పడుకున్న పశువులను దొంగిలించినవి కొన్ని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. తాజాగా చెన్నూర్ సమీపంలోని కిష్టంపేట వై జంక్షన్ వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యానును చెన్నూర్ పోలీసులు పట్టుకున్నారు. అదే రోజు డీసీఎం వ్యానులో మరికొందరు పశువులను తరలిస్తుండగా కిష్టంపేట చెక్‌పోస్టు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయగా డ్రైవర్ దాడి చేసి తప్పించుకుని పోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చెన్నూర్ మండలానికి చెందిన ఓ పార్టీ నాయకుడి అండదండలతోనే పశువుల అక్రమ రవాణా సాగుతోందనే ఆరోపణలున్నాయి. మంచిర్యాల, సరిహద్దు ప్రాంతాల మీదుగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో కౌటాల నుంచి జగిత్యాలకు అక్రమంగా వ్యానులో ఆవులు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాతమంచిర్యాలకు చెందిన బొలిశెట్టి మల్లేష్‌కు చెందిన ఆవును ఇంటి ముందు కట్టేసి ఉంచగా.. ఖరీదైన కారులో ఎక్కించుకుని దొంగిలించారు. సీసీ కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించి పట్టుకున్నారు. మంచిర్యాలలో కొందరు పశువుల దొంగలు రోడ్లపై తిరుగుతున్న ఆవులను అపహరించి రాత్రికి రాత్రే వధించి మాంసం విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ చీకటి దందా వెనుక ఓ పెద్ద ముఠానే పని చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
పశువులు తరలించేందుకు వారసంత చిట్టితోపాటు పశు వైద్యుడు ఇచ్చే అనుమతి పత్రం ఉండాలి. కబేళాలకు తరలించాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాలి. వార సంతలో, యజమాని వద్ద కొనుగోలు చేసేటప్పుడు ఆవులు, గర్భంతో ఉన్నవి, మూడేళ్లలోపు దూడలు తరలించడం పూర్తిగా నిషేధం. ఎడ్లు, గేదెలు అయితే వ్యవసాయానికి, పాడికి పనికి రావని పశువైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించాలి. పశువులను తరలించే వాహనంలో ప్రతీ పశువుకు మధ్య కనీసం రెండు చదరపు మీటర్ల స్థలం ఉండాలి. రవాణా సమయంలో తగినంత గాలి, వెలుతురు అందేలా చూడాలి. కానీ పశువులను తరలించే వారు ఇవేవీ పాటించడం లేదు. ఒక్కో డీసీఎం వ్యానులో 30 నుంచి 40 వరకు పశువులను తరలిస్తుంటారు. కొందరు వ్యాను పై కప్పును పూర్తిగా కప్పేసి రాత్రివేళల్లో అధిక వేగంతో వెళ్తున్నారు. ఎవరు ఆపినా ఆగకుండా వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగానే ముడుపులు ముట్టజెప్పి దర్జాగా వెళ్తుంటారు. ఒక్కోసారి ఎదురు దాడి చేస్తున్న సంఘటనలో చోటు చేసుకుంటున్నాయి.


