‘కార్తిక’ జాతర
మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో జ్వాలతోరణం వెలిగించిన భక్తులు
దండేపల్లి: గూడెంలో భక్తుల సామూహిక సత్యనారాయణ వ్రతాలు
దండేపల్లి/మంచిర్యాలఅర్బన్: తెలంగాణ అన్నవరంగా పేరొందిన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం కార్తిక పౌర్ణమి జాతర సందర్భంగా బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలి రావడంతో గుట్టంతా భక్తజన సంద్రంగా మారింది. గూడెం సమీప గోదావరి నదిలో స్నానాలు ఆచరించి గంగమ్మతల్లికి పూజలు చేశారు. కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అనంతరం గుట్టపై ఉన్న సత్యదేవుణ్ని దర్శించుకున్నారు. సన్నిధి ద్వారం సమీపంలో రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. సుమారు 1300 జంటలు సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. రూ.1500 వ్రతం టికెట్ కోసం భక్తులు ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. నీడ కోసం టెంటు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. సత్యదేవుణ్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది పర్యవేక్షించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాలలోని శివాలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాడాయి. విశ్వనాథస్వామి దేవస్థానం, కోదండ రామాలయం, గౌతమేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పిండినేతి దీపాలు వెలిగించారు. 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి విశ్వనాథస్వామి ఆలయంలో జ్వాలతోరణం వెలిగించారు.
‘కార్తిక’ జాతర
‘కార్తిక’ జాతర
‘కార్తిక’ జాతర
‘కార్తిక’ జాతర


