
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్/ఇచ్చోడ/నేరడిగొండ: పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ హెచ్చరించారు. మంగళవారం నేరడిగొండలోని కేజీబీవీ, ఇచ్చోడలోని జెడ్పీఎస్‌ఎస్, అడిగామ(కే)లోని అంగన్‌వాడీ కేంద్రం, జిల్లాకేంద్రంలోని శిశుగృహ, సఖీ కేంద్రం, బంగారిగూడలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, బోధన తీరు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. శిశుగృహలో ముగ్గురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలున్నారని, ఇందులో ఇద్దరు పిల్లలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపారు. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శిశుగృహ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సఖీ కేంద్రంలో కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యుడు సమీరుల్లా ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, ఉష్కం తిరుపతి, ఐసీపీఎస్ అధికారి రాజేంద్రప్రసాద్, ఆదిలాబాద్‌రూరల్ సీడీపీవో నర్సమ్మ, సాధికారత కోఆర్డినేటర్ యశోద, ఎస్‌సీపీసీఆర్ కన్సల్టెంట్ మధురవాణి, శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మి, కౌన్సిలర్ స్వప్న, స్వామి తదితరులున్నారు.