
వీడని జంట మరణాల మిస్టరీ..!
మంచిర్యాలక్రైం: జిల్లాలో సంచలనం సృష్టించిన నా నమ్మ, మనవరాలి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చే స్తున్నా కొలిక్కి రావడం లేదని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాలకు కారణం ఏమిటనేది తెలిసే అవకాశం ఉంది. మంచిర్యాలలోని గోపాలవాడ శివారు రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇంట్లో ఖమ్మంలోని 3వ టౌన్ ప్రాంతానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష(4) ఈ నెల 10న మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను విచారించినట్లు సమాచారం.
ఇల్లు అమ్మడానికి వచ్చి..
ఖమ్మంలోని 3టౌన్ ప్రాంతానికి చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, ట్రాన్స్‌జెండర్‌గా మారిన శిరీష ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ శిరీష రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఇల్లు నిర్మించుకుంది. 2022 జనవరి 4న అనుమానాస్పద స్థితిలో ఇదే ఇంట్లో చనిపోయింది. కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో స్థానిక ఉండే ఓ ఆర్‌ఎంపీతో సత్యవతి కుటుంబ సభ్యులకు పరిచయం ఏర్పడింది. సత్యవతి ఆర్‌ఎంపీతో కాస్త చనువుగా ఉండేదని, ఇంటి మరమ్మతులకు రూ.50వేలు ఇంట్లో ఎవరికీ తెలియకుండా అప్పుగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో ఆరు నెలల క్రితం ఆర్‌ఎంపీతో సత్యవతి భర్త చంద్రయ్యకు మధ్య గొడవ జరిగింది. ట్రాన్స్‌జెండర్ శిరీష ఇంటిని కొనడానికి పార్టీ సిద్ధంగా ఉందంటూ ఆర్‌ఎంపీ పిలిపించడంతో ఈ నెల 8న సత్యవతి, కుమారుడు గంగోత్రి, ఇతడి కూతురు గీతశిరీష కలిసి వచ్చారు. వచ్చిన రోజు ఆర్‌ఎంపీ స్పందించకపోవడంతో మరుసటి రోజు సత్యవతి, గీతశిరీష ఇక్కడే ఉండగా.. గంగోత్రి వెళ్లిపోయాడు. సాయంత్రం సత్యవతి తన కుమారుడు గంగోత్రికి ఫోన్ చేసి తనకు పాపకు విరేచనాలు, వాంతులు అవుతాయని చెప్పింది. 10న తెల్లవారే సరికి ఇద్దరూ మృతిచెంది ఉండడం కలకలం రేపింది.
అన్నీ అనుమానాలే..!
సత్యవతి, గీతశిరీష ఎలా మృతిచెందారు..? హత్య, ఆత్మహత్యా..? ఒకవేళ ఆత్మహత్య అయితే కారణాలు ఏంటి.. హత్య అయితే ఎవరు చేసి ఉంటారు.. ఎందుకు.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలంలో తెల్లకల్లు ప్లాస్టిక్ బాటిల్, పాల డబ్బా, వాటర్ బాటిల్, వండుకున్న ఎగ్ కర్రీ, వైట్ రైస్, ఛాయ్ లభించడంతో పోలీసులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. సత్యవతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక వేళ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఏ పాపం తెలియని పసిపాప శిరీష ఏం చేసింది. వాంతులు, విరేచనాలు తగ్గేందుకు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీని సంప్రదిస్తే ఇద్దరికీ వైద్యం అందించాడా..? ఒకవేళ అదే జరిగితే వైద్యం వికటించిందా..? లేదా రాత్రి వంట చేసుకొని తిన్నారు. సత్యవతి తెల్ల కల్లు తాగింది. కల్లులో గానీ ఎగ్ కర్రీలో గానీ ఎవరైన విష పదార్థాలు కలిపారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఫుడ్ ఫాయిజన్ అయినా కావాలి. విష ప్రయోగమైనా జరిగి ఉండాలి. వైద్యం వికటించి అయినా జరగాలి. గీతశిరీష మృతదేహం రంగు మారడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పోస్ట్‌మార్టం నివేదికపై ఆధారపడి ఉందని పోలీసులు చెబుతున్నారు.

వీడని జంట మరణాల మిస్టరీ..!