సాయుధులై పోరుబాట..! | - | Sakshi
Sakshi News home page

సాయుధులై పోరుబాట..!

Sep 17 2025 7:55 AM | Updated on Sep 17 2025 7:55 AM

సాయుధ

సాయుధులై పోరుబాట..!

● నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ● గడీలపై కరువు దాడులు.. భూపోరాటాలు

బెల్లంపల్లి: నిజాం నిరంకుశ, రాచరిక పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటంలో జిల్లా వాసులూ కీలకపాత్ర పోషించారు. బెల్లంపల్లికి చెందిన కమ్యూనిస్టు నాయకులు అగ్రభాగాన నిలిచారు. పీడిత ప్రజల విముక్తి కోసం తుపాకి పోరాటం సాగించారు. సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధులు బాశెట్టి గంగారాం, జే.కుమారస్వామి, పోతుగంటి పోశెట్టి సాయుధ పోరులో రహస్య జీవితాన్ని గడిపారు. ఆదివాసీలు, అట్టడుగు ప్రజలతో మమేకమై దొరలు, భూస్వాములు, నైజాం పోలీసులు, రజాకార్ల దాష్టీకాలపై నిప్పురవ్వలై చెలరేగారు. నేడు సెప్టెంబర్‌ 17 సందర్భంగా ప్రత్యేక కథనం.

మెరుపుదాడుల్లో ప్రత్యేకత

సాయుధ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు యోధులు జన్నారం, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టీ), చెన్నూర్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించారు. ప్రజాకంఠకులైన దొరలు, భూస్వాముల గడీలపై ఎన్నోమార్లు కరువుదాడులు చేసి ధాన్యం, ఎండుమిర్చి, పప్పు తదితర నిత్యావసర వస్తువులను పేదలు, గిరిజనులకు పంచి పెట్టారు. నిజాం పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరించి భూస్వాములు, దొరలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. భూస్వాముల భూముల దస్తావేజులను మంటల్లో ఆహుతి చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. బాశెట్టి గంగారాం నాయకత్వంలోని దళం మెరుపుదాడులు సాగించడంలో ప్రత్యేకత ఏర్పర్చుకుంది. తిర్యాణి ప్రాంతంలోని గిన్నెధరి, రోంపల్లి, గంగాపూర్‌ తదితర ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించింది.

భూస్వామిగా భ్రమపడి

ఆసిఫాబాద్‌కు చెందిన భూస్వామి పైకాజీని అంతం చేయాలని కమ్యూనిస్టు సాయుధ దళం నిర్ణయించింది. తాండూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో రాత్రివేళ సేదదీరడానికి భూస్వామి పైకాజీ వస్తున్న సమాచారం అందడంతో దళం అప్రమత్తమైంది. ఆ ఇంటి వద్ద మంచంపై నిద్రిస్తున్నట్లుగా తెలుసుకుని దళం దాడి చేసి హతమార్చింది. ఆ రోజు భూస్వామికి పైకాజీకి బదులు అతడి గుమాస్తా వచ్చి దళం చేతిలో హత్యమయ్యాడు. ఈ ఘటన ఆ రోజుల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచార లోపంతో జరిగిన ఘటనపై దళం విచారం వ్యక్తం చేసింది.

‘భీమ్‌’ను పట్టిచ్చిన ఇన్‌ఫార్మర్‌ను హతమార్చిన దళం

జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాటం సాగించిన గోండు వీరుడు కుమురంభీం నిజాం పోలీసులకు ప్రధాన లక్ష్యంగా మారాడు. భీమ్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మడావి కొద్దు అనే ఇన్‌ఫార్మర్‌ ఇచ్చిన పక్కా సమాచారంతో నిజాం పోలీసులు కుమురంభీమ్‌ను కాల్చి చంపినట్లు ప్రచారంలో ఉంది. దీంతో తెలంగాణ సాయుధ గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు దిగ్గజాలు రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, రాజ్‌బహదూర్‌గౌర్‌, దేవూరి శేషగిరిరావు తీవ్రంగా స్పందించి ఇన్‌ఫార్మర్‌ను మట్టుబెట్టాలని తిర్యాణి ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న బాశెట్టి గంగారాం నాయకత్వంలోని దళానికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇన్‌ఫార్మర్‌ మడావి కొద్దును కాల్చి చంపారు.

లంబాడితండాలో ఆశ్రయం

ఆదివాసీ ప్రాంతాల్లో దాడులు సాగించిన కమ్యూనిస్టు దళాలు పోలీసుల నిఘా పెరిగి గాలింపు చర్యలు తీవ్రమైన ప్రతీసారి బెల్లంపల్లి శివారు లంబాడితండా గ్రామంలో ఆశ్ర యం పొందేవారు. గ్రామస్తులు దళాలకు ఆశ్రయం కల్పించి అండగా నిలిచారు. పోలీ సు బలగాలకు దళ నాయకుల గుట్టు తెలి యకుండా కాపాడుకున్నారు. ఓసారి పోలీ సులు గ్రామంలోకి రాగా.. ఆ సమాచారం క్షణాల్లో షెల్టర్‌ ఇంట్లో ఉన్న దళ నాయకుడు కుమారస్వామికి కొరియర్లు చేరవేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో కుమారస్వామి మహిళగా వేషం మార్చుకుని పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. కమ్యూనిస్టు సాయుధ దళాలకు సుకాసి బాలయ్య, సుకాసి పోశం, సల్లం పోశం ప్రధాన కొరియర్లుగా వ్యవహరించారు.

చెన్నూర్‌ తొలి ఎమ్మెల్యే..

1952లో చెన్నూర్‌, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నూర్‌కు చెందిన స్థానికుడు తొలి ఎమ్మెల్యేగా సూరికి పేరుంది. 1952 నుంచి 57 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. నాటి నుంచి నేటి వరకు స్థానికుడు, చెన్నూర్‌ పట్టణానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యింది విశ్వనాథ సూరి మాత్రమే.

సాయుధులై పోరుబాట..!1
1/3

సాయుధులై పోరుబాట..!

సాయుధులై పోరుబాట..!2
2/3

సాయుధులై పోరుబాట..!

సాయుధులై పోరుబాట..!3
3/3

సాయుధులై పోరుబాట..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement