
పాలకవర్గాలు రద్దు
11పీఏసీఎస్‌ల్లో పర్సన్ ఇన్చార్జీల నియామకం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లకు ఉద్వాసన పలు ఆరోపణలతో వేటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో 11 పీఏసీఎస్‌ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లను తొలగిస్తూ వారి స్థానంలో పర్సన్ ఇన్‌చార్జీలుగా సహకార సంఘ అధికారులను నియమించారు. జిల్లాలో 20 పీఏసీఎస్‌లు ఉండగా.. 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం గత ఆగస్టుతోనే ముగిసింది. ప్రభుత్వం సొసైటీలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా పాలకవర్గాలను యధాతథంగా వచ్చే ఫిబ్రవరి వరకు పొడగించింది. దీంతో గత ఆగస్టుకు ఐదేళ్లు పూర్తయి కొత్త పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా నిలిచిపోయాయి. పలు సొసైటీల నిర్వహణలో చైర్మన్లు, ఇతర సభ్యులు, సీఈవోలపై ఆరోపణలు రావడంతో చివరికి పాలకవర్గాలనే రద్దు చేసింది.
రుణాలు, నిధుల దుర్వినియోగం
గత ఐదేళ్ల కాలంలో పలు చోట్ల పాలకవర్గాల చైర్మ న్లు అవినీతికి పాల్పడ్డారు. రైతులకు రుణాల మంజూరు, మాఫీ సమయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా సొసైటీ నిర్వహణలో సీఈ వోలు, ఇతర సిబ్బంది అక్రమాలు సైతం వెలుగులో కి వచ్చాయి. ఇటీవల ఎరువుల పంపిణీలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు గతంలో విజిలెన్స్, శాఖ పరమైన విచారణలు జరిగాయి. ముఖ్యంగా చైర్మన్లు, ఇతర సభ్యులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించకపోవడం వంటివి ఉన్నా యి. ఈ ఆరోపణలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స హకార శాఖ అధికారులు గత కొద్దిరోజులుగా విచా రణ చేపట్టారు. నిజమేనని తేలడంతో రద్దు చేశారు.
ఆదాయం లేక అవస్థలు
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు స్వల్పకాలిక పంట రుణాలు, ఎరువులు, యంత్రాలు, ఇతర సబ్సిడీ పంపిణీలో సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. కానీ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలు కనీస ఆదాయం లేక కొట్టుమిట్టాడుతున్నా యి. రైతులకు రుణాల పరపతి పెంచుతున్నా, సొ సైటీ రోజువారీ కార్యకలాపాలకు నిధులు లేని పరి స్థితులు ఉన్నాయి. నెలవారీగా పాలకవర్గాలకు గౌర వ వేతనం సైతం అందడం లేదు. కొన్ని చోట్ల చైర్మ న్లు సొంతంగా డబ్బు ఖర్చు చేస్తున్నవారు ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ కోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేశారు. డైరెక్టర్లను క్యాంపులకు తరలించి ప్రత్యర్థులపై నెగ్గారు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికై న వారు ఉన్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుతో చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. జిల్లాలో పాలకవర్గాల్లో గత బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులే మొదట అధికంగా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
రద్దయినవి ఇవే..
పాలకవర్గాలు రద్దయిన వాటిలో మంచిర్యాల, జెండా వెంకటాపూర్, నెల్కివెంకటాపూర్, పడ్తనపల్లి, గూడెం, చెన్నూరు, కోటపల్లి, జైపూర్, మందమర్రి, భీమిని, నెన్నెల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి.