
అడవులతోనే మనుగడ
దండేపల్లి: అడవులతోనే మానవాళికి మనుగడ ఉంటుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ అన్నారు. మండలంలోని తాళ్లపేట అటవీ సెక్షన్ పరిధి కుంటలగూడ గిరిజన గ్రామంలో అడవుల రక్షణపై మంగళవారం అవగాహన కల్పించారు. సాగు కోసం కొన్ని చోట్ల కొంతమంది అడవులను పాడు చేస్తూ ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. అడవులతోపాటు అందులో జీవించే వన్యప్రాణులకు కూడా హాని కలిగించొద్దని తెలిపారు. అడవులు, వన్యప్రాణులకు హాని చేస్తే కఠినమైన కేసులుంటాయని తెలిపారు. వైల్డ్ లైఫ్ ఇన్‌స్పెక్టర్ ఆది మల్లయ్య, తాళ్లపేట డీఆర్వో సాగరిక, ఎఫ్‌బీవో పద్మజరాణి, క్షేత్ర జీవశాస్త్రవేత్త ఎల్లం తదితరులు పాల్గొన్నారు.