
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
సారంగపూర్: ఒంటరితనం భరించలేక వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కుటుంబీకులు, ఎస్సై తెలిపిన వివరాలు.. మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన తోకల పోశెట్టి(65)కి ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్యకు ఇద్దరు కుమార్తెలు, చిన్న భార్యకు ఒక కుమార్తె ఉన్నారు. అయితే గత 20 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక హనుమాన్ ఆలయంలో వంట, బస చేస్తూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేక, ఒంటరిగా బతకలేక తనలో తానే కుమిలిపోయాడు. ఈక్రమంలో రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. గ్రామశివారు ప్రాంతంలోని దడే గుట్ట వద్ద ఒర్రె వైపు పశువులు మేపేందుకు వెళ్లిన వారికి గురువారం పోశెట్టి ఉరేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు, ఆయన కుటుంబీకులకు చేరవేశారు. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.