TS Mancherial District News: ‘కారు’లో చల్లారిన అసంతృప్తి మంటలు..
Sakshi News home page

‘కారు’లో చల్లారిన అసంతృప్తి మంటలు..

Oct 14 2023 1:36 AM | Updated on Oct 14 2023 8:51 AM

- - Sakshi

సమావేశమైన ఎమ్మెల్యేలు సుమన్‌, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, అరవింద్‌రెడ్డి

మంచిర్యాల: గులాబీ పార్టీలో అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గుతున్నారు. అధిష్టానం సూచనలతో తమ పట్టు వీడుతున్నారు. జిల్లాలో మంచిర్యాల బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా భావిస్తూ మరోసారి గెలుపునకు కృషి చేసేందుకు సిద్ధమయ్యారు.

శుక్రవారం మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి ఇంట్లో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఖానాపూర్‌ ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, కార్మిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. మంచిర్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చాలని అరవింద్‌రెడ్డి పట్టుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోసం పని చేస్తామని ప్రకటించడంతో గులాబీ పార్టీలో ఐక్యత రాగం మొదలైంది.

దీంతో మంచిర్యాల నియోజకవర్గంలో అసమ్మతి దాదాపు చల్లారినట్లేనని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక బెల్లంపల్లిలో టికెట్‌ ఆశించిన రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించడంతో అక్కడ అసంతృప్తి చల్లారింది. ఇక క్షేత్రస్థాయిలో పట్టణ, మండల, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని చల్చార్చేందుకు జిల్లా నాయకత్వం ప్రణాళికలు వేస్తోంది.

జిల్లాలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి : బాల్క సుమన్‌
మంచిర్యాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ జెండా మళ్లీ ఎగరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీని గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలసి ప్రత్యేకంగా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఎన్నికల సంబంధించిన సమాలోచనలు చేశామని చెప్పారు. అందరం సమన్వయంతో ముందుకు సాగుతామని, మరోమారు సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. సీఎం ఈ నెల 15న అభ్యర్థులకు బీ ఫాం ఇస్తారని, 17నుంచి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాల ప్రశాంతంగా ఉండాలన్నా, సమర్థవంతమైన అభివృద్ధి జరగాలన్నా బీఆర్‌ఎస్‌కే ఓటేయాలని అన్నారు. అరవింద్‌రెడ్డి గతంలోనూ, ప్రస్తుతం తమ గెలుపు కోసం పని చేస్తారని చెప్పారు. అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో కార్మికులకు సీఎం కేసీర్‌ బోనస్‌ ఇచ్చారని, గతంలో వచ్చిన దానికి కన్నా 20వేల మెజార్టీతో దివాకర్‌రావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రెండు స్థానాలకు బీసీలకే టికెట్లు ఇచ్చామని, విపక్ష పార్టీలు ఎన్ని సీట్లు ఇస్తాయో చూస్తామని అన్నారు.

అసంతృప్తులకే గెలుపు బాధ్యతలు
గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పగించారు. ‘పురాణం’ను ముధోల్‌ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు. ఇక అరవింద్‌రెడ్డికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావును గెలిపించేందుకు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో ఆయన కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోసం పని చేయనున్నారు.

ఇక్కడ ఎన్నికల ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అరవింద్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల షెడ్యూ ల్‌ వెలువడకముందే మంచిర్యాలలో ఈసారి ఎన్నికల్లో బీసీలకే బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని పార్టీలో స్థానిక నాయకులు పట్టుబట్టడం, పలు కార్యక్రమాలు చేయడం తెలిసిందే. ఆ నాయకులకు అరవింద్‌రెడ్డి మద్దతు పలికా రు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్‌ చేశారు. కొందరు పార్టీని వీడా రు. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి, కేటీఆర్‌ దృష్టి తీసుకెళ్లారు. చివరకు అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేకపోవడంతో పార్టీలో వెనక్కి తగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement