సింగరేణి సిగలో మరో నగ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి సిగలో మరో నగ

Mar 9 2026 7:39 AM | Updated on Mar 9 2026 7:39 AM

జైపూర్‌లో కొత్త ప్లాంటు నిర్మాణ పనులు బీటీజీ, బీవోపీ పనులు బీహెచ్‌ఈఎల్‌ కంపెనీకి రూ.9500 కోట్ల అంచనాతో పనులు నాలుగేళ్లలో పనుల పూర్తికి ప్రణాళికలు

చెన్నూర్‌: సింగరేణి సిగలోకి మరో వెలుగు నగ వచ్చిచేరనుంది. విద్యుత్‌ ఉత్పత్తిలోకి అడుగుపెట్టిన సంస్థ 1200 మెగావాట్ల జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసిన తక్కువ కాలంలోనే రికార్డుస్థాయిలోనే దేశంలో కీర్తిని సంపాదించిన విషయం తెలిసిందే. కొత్తగా 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం చేపడుతోంది. రూ.9500 కోట్ల అంచనాతో నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్‌ కంపెనీకి అప్పగించింది. సూపర్‌క్రిటికల్‌ పద్ధతిలో పర్యావరణ హితంగా ఈ నిర్మాణం సాగనుంది. బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ బీటీజీ సివిల్‌ విభాగాల పనులు కేపీసీ కంపెనీకి, బీవోపీ పనులు పవర్‌మేక్‌ కంపెనీకి అప్పగించింది. ఇప్పటికే పలు కంపెనీలు నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నాయి. నాలుగేళ్లల్లో పనుల పూర్తికి అధికార యంత్రాంగం ప్రణాళికలు తయారు చేసింది. మూడు షిఫ్టుల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ

సంయుక్తంగా ఈ పనులు చేపడుతున్నాయి.

జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు

కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంటు జాయింట్‌ వెంచర్‌(జేవీ)గా తెలంగాణ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నాయి. తెలంగాణ 74 శాతం వాటా, రాజస్థాన్‌ 26 శాతం వాటాగా నిర్ణయించగా రాజస్థాన్‌ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫైనల్‌ చేయాల్సి ఉంది. ఇది కొలిక్కివస్తే తర్వాత పీపీఏ (పవర్‌ పర్చస్‌ అగ్రిమెంట్‌) కావాల్సి ఉంటుంది. ఇంతకాలం సింగరేణి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి ఎస్టీపీపీ ద్వారా సాధిస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని రూ.4.50కు ఒక్క యూనిట్‌గా విక్రయిస్తుండగా, ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటు ద్వారా సాధించే విద్యుత్‌ను రాజస్థాన్‌కు విక్రయించడానికి అంగీకారం కావాల్సి ఉంది. అనుకున్న విధంగా రెండు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం తర్వాత బ్యాంకుల ద్వారా నిధుల సమీకరణ జరగనుంది.

బొగ్గు రవాణాకు రైలు మార్గం..

ఽథర్మల్‌ పవర్‌ ప్లాంటు విద్యుత్‌ ఉత్పత్తికి ప్రధానంగా నీరు, బొగ్గు అవసరం. ఇప్పటికే సింగరేణి సంస్థ ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మించగా గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా నీళ్లు తరలిస్తుంది. ఇక బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసింది.

సీఎం రాక చివరి నిమిషంలో వాయిదా!

కొత్త ప్లాంటు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక కోసం అధికార యంత్రాంగం గతేడాది రెండుసార్లు కార్యక్రమం ఖరారు చేశారు. చివరి నిమిషంలో వాయిదా పడుతూ వచ్చింది. గతంలో సీఎండీగా పని చేసిన ఎన్‌.బలరాం అనఽధికారికంగా ఇక్కడ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దీంతో పనులు కొనసాగుతున్నాయి. కానీ కొత్త ప్లాంటు నిర్మాణానికి ఏర్పాటు చేసిన పైలాన్‌ మాత్రం అలంకారప్రాయంగా మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement