గురుకులం.. మైనార్టీలకు వరం
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరంలో ఐదోతరగతి, ఇంటర్ ప్రవేశాలకు ప్రక్రియ షురూ అయ్యింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అడ్మిషన్లకోసం అధికారులు ముందస్తు ప్రచారం చేపట్టారు. గురుకులాల్లో అందిస్తున్న ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు, విద్యార్థులకు అందించే వస్తువుల ప్రదర్శనతో మసీదులు, ఆయా బస్తీల్లో ఆకట్టుకుంటున్నారు. ఆధునికత సౌకర్యాలతో పాటు ఉచితంగా అందిస్తున్న యూనిఫాం, బూట్లు, సాక్సులతో కూడిన స్పోర్ట్ డ్రెస్, టై, బెల్ట్, ఐడీకార్డు, 12 వస్తువులతో కూడిన కాస్మొటిక్ కిట్, స్టూడెంట్ స్టేషనరీ, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లపై వివరిస్తున్నారు. గురుకులాల్లో కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇదివరకు మైనార్టీ గురుకులాల్లో పూర్తిస్థాయి సీట్లు భర్తీకానీ పరిస్థితి. దీంతో నాన్ మైనార్టీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ముందుస్తు ప్రచారంతో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ప్రవేశాలు ఇలా..
2026–27 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో కొత్త ప్రవేశాలు, 6,7,8 తరగతుల్లో మిగిలి ఉన్న (బ్యాక్‌లాగ్) ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం మైనార్టీలు (ముస్లిం 62 శాతం, క్రిస్టియన్ 9, సిక్కులు 1, జైనులు 1, బుద్దిస్టు 1, పారిసిస్ 1) నాన్ మైనార్టీ కింద 25 శాతం (ఎస్సీలు 6శాతం, ఎస్టీలు 5, బీసీలు 12, ఓసీ, ఈబీసీలు 2శాతం) సీట్లు భర్తీ చేయనున్నారు. మైనార్టీల్లో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. మైనార్టీ యేతర విద్యార్థులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులు చేరని పక్షంలో నాన్ మైనార్టీ విద్యార్థులతో సీట్లు భర్తీ చేయనున్నారు.
గతేడాది భర్తీకాని ఖాళీలు
అత్యల్ప పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన టీఎంఆర్‌ఈఐఎస్‌లో ప్రవేశాల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో గతేడాది 1,240 సీట్లకుగానూ 931 సీట్లు మాత్రమే భర్తీ కాగా 309 సీట్లు మిగిలిపోయాయి. మంచిర్యాల (గర్‌ల్స్) మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో 480 సీట్లకుగానూ 374 మంది ప్రవేశం పొందగా 106 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బెల్లంపల్లి (బాలికల)లో 280 మందిగానూ 235 సీట్లు భర్తీ కాగా 45 సీట్లు మిగిలిపోయాయి. చెన్నూర్‌లో 480 సీట్లకుగానూ 322 భర్తీ కాగా అత్యధికంగా 158 ఖాళీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మోడల్‌స్కూల్, కేజీబీవీ, ఇతర గురుకులాల్లో అడ్మిషన్లకు పోటీ తీవ్రతగా ఎక్కువగా ఉండగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో మిగిలిపోవడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియకముందే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు తీసిపోని విధంగా ముందస్తుగా అడ్మిషన్ల పెంపునకు అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు.


