● ఇరాన్‌, అమెరికా యుద్ధంతో పెరిగిన గ్యాస్‌ ధరలు ● గృహ సిలిండర్‌కు రూ.60, కమర్షియల్‌కు రూ.115 ● జిల్లాలో వినియోగదారులపై ఆర్థిక భారం | - | Sakshi
Sakshi News home page

● ఇరాన్‌, అమెరికా యుద్ధంతో పెరిగిన గ్యాస్‌ ధరలు ● గృహ సిలిండర్‌కు రూ.60, కమర్షియల్‌కు రూ.115 ● జిల్లాలో వినియోగదారులపై ఆర్థిక భారం

Mar 9 2026 7:39 AM | Updated on Mar 9 2026 7:39 AM

● ఇరాన్‌, అమెరికా యుద్ధంతో పెరిగిన గ్యాస్‌ ధరలు ● గృహ సిలిండర్‌కు రూ.60, కమర్షియల్‌కు రూ.115 ● జిల్లాలో వినియోగదారులపై ఆర్థిక భారం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశ్చిమాసియా దేశ యుద్ధ మంటలు మన వంటింటిని తాకాయి. అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య యుద్ధంతో అక్కడి చమురు కంపెనీల్లో ఉత్పత్తి, రవాణాపై ప్రభావం చూపుతోంది. దీంతో దేశానికి సకాలంలో వచ్చే పెట్రోలియం ఉత్పత్తులైన ఎల్‌పీజీ (ద్రవ శిలాజ వాయువు) సిలిండర్ల ధరలు అమాంతం పెరిగాయి. గృహా వినియోగదారులు వినియోగించే 14.20 కిలోల సిలిండర్‌కు రూ.60 చొప్పున, వ్యాపార వర్గాలు వినియోగించే 19 కిలోల సిలిండర్‌కు రూ.115 చొప్పున అమాంతం పెరిగి వినియోగదారుడికి ధరల మంటలు పుట్టించాయి. జిల్లాలో మొత్తం1.66 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో ప్రతీ నెలా పదిశాతం రీఫిల్‌కు వస్తాయనే అంచనా ఉంది. నెలకు రూ.పదిలక్షల వరకు గృహ వినియోగదారులపై భారం పడనుంది.

వంటలకు ధరల మంటలు

గ్యాస్‌ ధరలు పెరగడంతో ప్రధానంగా హోటళ్ళు, రెస్టారెంటు, బజ్జీకోట్లు, టీ షాపులు, తదితర వంట ఆధారిత రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే పెళ్ళిళ్ళ సీజన్‌ కావడంతో వంటకు వినియోగం, శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక దినాల్లో వాడకం పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

21 రోజుల బుకింగ్‌ ఆంక్షలు

గృహ వినియోగదారులకు నెలకు ఒకటి చొప్పున ఏడాదిలో 12 గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో నిర్ణీత రోజులు పూర్తయితేనే గ్యాస్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా సిలిండర్‌ వినియోగదారుడికి చేరిన 21 రోజుల తర్వాతనే మరో సిలిండర్‌ బుకింగ్‌ చేసుకునే నిబంధన విధించి గ్యాస్‌ వాడకంపై నిబంధన విధించారు. దీంతో ఎడాపెడా బుకింగ్‌ చేసుకోవడం తగ్గి పొదుపుగా గ్యాస్‌ వాడే అవకాశం కలిగింది. అలాగే వ్యాపార వర్గాలు ఉపయోగించే కమర్షియల్‌ గ్యాస్‌ ఏజెన్సీలకు ఆయిల్‌ కంపెనీలు ఎత్తివేయడంతో వినియోగదారులకు అందకుండా పోయింది. గృహ వినియోగదారులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.46 కలుపుని ఆయిల్‌ కంపెనీలు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.500 లబ్ధిదారులకు అందడం లేదు.

ప్రస్తుతం సరిపడా నిల్వలు

జిల్లాలో ప్రస్తుతం సరిపడా గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని, అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే మూడు నెలల తర్వాత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో గల్ఫ్‌ దేశాల నుంచి నేరుగా పైపులైన్లతో దేశానికి సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం యుద్ధం కారణంగా నిలిచిపోయాయి. దీంతో కేవలం సముద్ర మార్గంలో షిప్పుల్లో రవాణా అవుతోంది. దీంతో సరఫరాలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా ఆయిల్‌ కంపెనీల్లో చమురు వెలికితీతలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో గ్యాస్‌ ఉత్పత్తిలోనూ జాప్యం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement