సభావేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిత్రంలో కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్,
వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, బలరాం నాయక్, వంశీకృష్ణ, సీతక్క, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్
నాగర్‌కర్నూల్/అచ్చంపేట: ‘‘అచ్చంపేటను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అడుగుతున్నారు.. కానీ నేనే ఈ గడ్డపై పుట్టిన బిడ్డను. మీ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. నా రక్తాన్ని చెమటగా మార్చి అచ్చంపేటను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం అచ్చంపేటలోని వైజంక్షన్‌లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన–ప్రగతిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోటి మంది మహిళలకు చిలకపచ్చరంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కొత్తగా మంజూరైన 4.89 లక్షల చేయూత పింఛన్లను కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ముందుగా లింగాల రోడ్డులోని హెలిప్యాడ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి 3.5 కి.మీ. పాదయాత్ర ద్వారా బహిరంగ సభకు చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. అచ్చంపేట ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని, దాని విశిష్టతను తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రం ఒకవైపు, మద్దిమడుగు ఆంజనేయస్వామి క్షేత్రం మరోవైపు, తెలంగాణ అమరనాథ్ సలేశ్వరం ఇంకోవైపు ఉన్నాయని పేర్కొన్నారు. పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల నాయకులు, బహమనీ, కుతుబ్‌షాహీ సుల్తానులు, నిజాంల పాలనకు ఈ ప్రాంతం చారిత్రక నేపథ్యంగా నిలిచిందన్నారు. చెంచు గిరిజనుల స్వచ్ఛమైన జీవనానికి ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతం తన పుట్టినిల్లు కావడం గొప్ప వరమని చెప్పారు. అచ్చంపేటలో అడుగుపెడితే 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫర్‌ను ఎదిరించి నిలిచిన తెలంగాణ వీరవనిత, దక్షిణ భారతదేశ ఝాన్సీ లక్ష్మీబాయి అచ్చమాంబ వీరత్వం గుర్తుకొస్తుందన్నారు. ఆమె పేరుతో రూపుదిద్దుకున్న అచ్చంపేట అదే వారసత్వాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రాణి అచ్చమాంబ, ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, కుటుంబ జీవిత బీమా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది మహిళలకు పాలపిట్ట రంగు చీరలు అందించామని, ఇప్పుడు అచ్చంపేట వేదికగా చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరామ్‌నాయక్, సీఎం సలహాదారు, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, మేఘారెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, డాక్టర్ రాంచంద్రనాయక్, తోట లక్ష్మీకాంతరావు, వీర్లపల్లి శంకర్, బాలూనాయక్, కందూరు జయవీర్, వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్ హేమంత్‌కేశవ్‌పాటిల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పదేళ్ల పాలనలో ప్రాజెక్టులను పడావు పెట్టారు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం విమర్శించారు. పాలమూరు బిడ్డలను మోసం చేసి కృష్ణా జలాల్లో ముంచారని ఆరోపించారు. కృష్ణా జలాలతో ఈ ప్రాంతాలను తడపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. అచ్చంపేట, ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, గూడెందొడ్డి రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాలమూరు బిడ్డగా తనను రేవంతన్న అని పిలుస్తుంటే గుండె పులకిస్తుందని, ఈ నేల ను కృష్ణా జలాలతో తడపాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ శ్రీశైలం ప్రాజెక్టు వెనుక నుంచి ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతోందని తెలిపారు. గతంలో ఢిల్లీలో సంతకాలు చేసి పాలమూరు ప్రయోజనాల కు నష్టం కలిగించారని, మిగులు, వరద జలాల్లోనూ అన్యా యం చేయడమే కాకుండా శాశ్వతంగా హక్కులను తాకట్టు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నా రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా
పాలమూరు నేలను కృష్ణా జలాలతో తడపాల్సిన బాధ్యత నాపై ఉంది..
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
అచ్చంపేట బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి
రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
మహిళలకు చిలకపచ్చ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కొత్తగా మంజూరైన 4.89 లక్షల చేయూత పింఛన్లు ఖాతాల్లో జమ


