జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్తంభాలు కేబుల్ వైర్లతో నిండిపోతున్నాయి. నగరంలో 60 డివిజన్ల పరిధిలో విద్యుత్ సరఫరా కోసం వేలాది స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిని కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వినియోగించుకుంటున్నారు. అయితే స్తంభాలపై నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కేబుళ్లు ఏర్పాటు చేస్తుండటంతో అవి గజిబిజిగా మారుతున్నాయి. విద్యుత్ శాఖ నిబంధనలు నిర్దేశించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పరిస్థితి అదుపు తప్పుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పొంచి ఉన్న ప్రమాదం..
విద్యుత్ స్తంభాల వద్ద అస్తవ్యస్తంగా వేలాడుతున్న కేబుల్ వైర్లు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రథోత్సవంలో విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పలు చోట్ల విద్యుత్ స్తంభాలపై కేబుళ్లు వేలాడుతున్నాయి. విద్యుత్ తీగల నుంచి వెలువడే నిప్పురవ్వలు కేబుళ్లపై పడితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు లైన్‌మెన్లు స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అయితే కేబుళ్ల గందరగోళం కారణంగా కొన్ని చోట్ల స్తంభాలు ఎక్కేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సిబ్బంది ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి అనధికార కేబుళ్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ స్తంభాలకు కేబుళ్ల ఉచ్చు
నిబంధనలు పట్టించుకోని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు
అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా వైర్ల ఏర్పాటు


